సమీక్ష : విష్ యూ హ్యాపీ బ్రేకప్ – నీరసమైన ప్రయోగం!

Wish You Happy Breakup review

విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కిరణ్ రావు

నిర్మాత : కిరణ్ రావు

సంగీతం : పరాగ్ చాబ్రా, శేషు కేఎంఆర్

నటీనటులు : ఉదయ్ కిరణ్, తేజస్వి, శ్వేతా వర్మ..

అంతా కొత్త వాళ్ళతో అతి తక్కువ బడ్జెట్‌తో దర్శక, నిర్మాత కిరణ్ రావు చేసిన ప్రయత్నమే ‘విష్ యూ హ్యాపీ బ్రేకప్’. నెలరోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఇండిపెండెంట్ సినిమా, ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం రెండేళ్ళు పట్టింది. ఈతరం ప్రేమలను, ప్రేమలో విఫలమైతే యూత్ ఏం చేస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించిన సినిమాగా ప్రచారం పొందిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

నరేష్ (ఉదయ్ కిరణ్).. ఎప్పటికైనా సినీ దర్శకుడవ్వాలని కలలు కనే ఓ యువకుడు. కెరీర్‌పైన పూర్తిగా శ్రద్ధ లేదని, ఇలా ఉంటే తనకు నచ్చరని చెప్పి నరేష్ ప్రేయసి నిత్యా అతడిని కాదని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నరేష్ జీవితం ఏమైందీ? బ్రేకప్ వల్ల అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ బ్రేకప్ నుంచి బయటకొచ్చి తన కెరీర్‍ వైపు ఎలా అడుగులు వేశాడన్నదే క్లుప్తంగా ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అన్నింటికంటే పెద్ద ప్లస్ పాయింట్ అంటే నెరేషన్ కొత్తగా ఉండడం అని చెప్పుకోవాలి. దర్శకుడవ్వాలని కలలు గనే హీరో ఎప్పుడూ కెమెరాను వెంటేసుకునే తిరుగుతూంటాడు. అదే క్రమంలో తన రోజూవారి జీవితాన్ని ఎప్పటికప్పుడు కెమెరాలో బంధిస్తూ ఉంటాడు. అలా బంధించిన ఫుటేజ్‌నే ఓ క్రమంలో పేర్చుకుంటూ పోయి సినిమాగా చెప్పాలనుకోవడం ప్రయోగమే! ఈ ప్రయోగాన్ని సినిమా మొత్తం నడిపించడం తేలికైన పనికాదు. దాన్ని బాగానే హ్యాండిల్ చేశారు.

ఇక హీరో ఉదయ్ కిరణ్ చూడడానికి బాగున్నాడు. నటన పరంగానూ బాగానే ఆకట్టుకున్నాడు. తేజస్విది చిన్నరోల్ అయినా ఉన్నంతలో బాగా చేసింది. తేజస్వి కనిపించే ఇరవై నిమిషాల ఎపిసోడ్ బాగా ఆకట్టుకుంది. సురేష్ అనే పాత్రలో నటించిన దేవా బాగా నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, చెప్పుకోవడానికి పెద్దగా కథే లేని సినిమాలో ఎమోషన్ కూడా లేకపోవడం నిరుత్సాహపరచే అంశం. బ్రేకప్ తర్వాత ఓ యువకుడి 365 రోజులను సన్నివేశాలుగా చెప్పుకుంటూ పోవడమే తప్ప సినిమాలో బలమైన ఎమోషన్ అన్నదే లేదు. ఇక క్లైమాక్స్‌లో కావాలనే ఏదో సందేశం ఇచ్చేలా చేసిన ప్రయత్నం కూడా అస్సలు బాలేదు. హీరో గ్యాంగ్ చుట్టూ వచ్చే సన్నివేశాలు కొన్నిసార్లు నవ్వించినా, ఎక్కువభాగం మాత్రం విసుగు తెప్పించాయి.

ఇక ఫస్టాఫ్ మొత్తం హీరో గ్యాంగ్ అమ్మాయిలను తిడుతూ ఉండడం చుట్టూనే కథ నడుస్తూ ఉంటుంది. ఇది కొద్దిసేపు సరదాగానే అనిపించినా, ఓవరాల్‌గా చూస్తే అమ్మాయిలను తక్కువ చేయడంగానే కనిపించింది. లాజిక్‌కి ఏమాత్రం అందకుండా సన్నివేశాలు రావడం కూడా బాగోలేదు. మేకింగ్‌లో ప్రయోగం చేశారన్నది ఒక్కటి వదిలేస్తే కథ, కథనాలను ఎక్కడా పట్టించుకోకపోవడంతో ఆ ప్రయోగం కూడా వృథా అయిపోయింది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు కిరణ్ రావు విషయానికి వస్తే, ప్రయోగాత్మకంగా ఓ కథ చెప్పాలన్న ఆలోచన తప్ప ఎక్కడా అతడు ప్రతిభ చూపలేకపోయాడు. కథ, కథనాలను సరిగ్గా రాసుకొని, ఇదే ప్రయోగం చేసుంటే వేరేలా ఉండేదేమో! కథలో అసలు ఎమోషనే లేకుండా ఓ సినిమా చేయడం పెద్ద తప్పిదమే.

సినిమాటోగ్రఫీ, సినిమాకు ఎంచుకున్న మేకింగ్ స్టైల్‌ను బట్టిచూస్తే బాగానే ఉంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇండిపెండెంట్ సినిమా అని చూస్తే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.

తీర్పు :

ఇండిపెండెంట్ సినిమా అన్నది చిన్నగా తెలుగు సినీ పరిశ్రమకూ విస్తరిస్తోన్న తరుణంలో, ఈ స్టైల్‌ను నమ్మి, ప్రయోగాత్మక కథతో ఓ సినిమా చేయాలని చేసిన ప్రయత్నమే ‘విష్ యూ హ్యాపీ బ్రేకప్’. ఒక్క ఈ ప్రయోగం చేయాలన్న ఆలోచన తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేకపోవడం నిరాశపరిచే అంశం. కొన్నిచోట్ల ఫర్వాలేదనిపించే కామెడీ, తేజస్వి ఎపిసోడ్ లాంటివి ఉన్నంతలో ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. చెప్పుకోడానికి ఈ సినిమాలో ఏదైనా ఉందీ అంటే అది ప్రయోగం చేయాలన్న ప్రయత్నమే. అయితే ఆ ప్రయత్నం పూర్తిగా వృథా అవ్వడమే నీరసపరిచే అంశం!

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review