సమీక్ష : ప్రేమతో మీ కార్తిక్ – ఈ కార్తిక్ కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోవచ్చు !

Published on Nov 10, 2017 7:33 pm IST

విడుదల తేదీ : నవంబర్ 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : రిషి

నిర్మాత : రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ

సంగీతం : షాన్ రెహమాన్

నటీనటులు : కార్తికేయ, సిమ్రత్ కౌర్, మురళి శర్మ, గొల్లపూడి మారుతిరావ్

నూతన దర్శకుడు రిషి దర్శకత్వంలో కొత్త హీరో, హీరోయిన్ కార్తికేయ, సిమ్రన్ నటించిన ‘ ప్రేమతో మీ కార్తీక్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా పేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్తిక్ (కార్తికేయ) విదేశాల్లో పుట్టి పెరిగిన అబ్బాయి. ప్రేమలు, ఆప్యాయతలు, గురుంచి పెద్దగా తెలీకుండా పెరుగుతాడు. ఒక సందర్భంలో తన తండ్రి గోపి కృష్ణ (మురళి శర్మ) కార్తీక్ ను ఒక హాలిడే ట్రిప్ కు వెళదాం అంటాడు. అలా ఇద్దరు ఇండియా వచ్చాక కార్తీక్ కు అంజలి (సిమ్రత్ కౌర్) పరిచయం అవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది ? కార్తీక్ బంధాలు బంధుత్వాల గురించి ఎలా తెలుసుకున్నాడన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కొత్త హీరో కార్తికేయ బాగా నటించాడు. బాధ్యత లేని అబ్బాయిగా మరియు విలువలు తెలిసిన యువకుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ హీరోకు తెలుగులో మంచి భవిష్యత్తు ఉంటుంది. హీరోయిన్ సిమ్రత్ స్క్రీన్ మీద చూడ్డానికి బాగుంది అలాగే యాక్టింగ్ కూడా బాగా చేసింది. హీరో తండ్రికి ఆమెకు మధ్యన నడిచే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. మానవతా విలువలు చెప్పే కొన్ని డైలాగ్స్ బాగా రాశాడు డైరెక్టర్.

మనం ఎక్కడ ఉన్నా సొంత ఊరిని మర్చిపోకూడదు, బంధాలను గుర్తు పెట్టుకోవాలని డైరెక్టర్ ఈ సినిమా ద్వారా చెప్పడం నచ్చింది. సగటు ప్రేక్షకుడికి నచ్చే పాయింట్ తో తన మొదటిటి సినిమా తీశాడు డైరెక్టర్ రిషి. ఝాన్సీ ఈ సినిమాలో పల్లెటూరి మహిళగా మంచి పాత్రలో నటించింది. గొల్లపూడి మారుతిరావుగారు చేసిన పాత్ర చిన్నదే అయినప్పటికీ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. సినిమాకు ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ స్థానంలో ఆయన తప్ప మరెవరూ చేసినా అంత ఆసక్తి ఉండేదికాదేమో.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది కానీ చెప్పిన విధానంలో కొత్తదనం లేదు. గ్రామంలో ఏ.టి.ఎం ఉంటుంది కానీ మొబైల్ లో సిగ్నల్ లేదని హీరో ఇబ్బందులు పడతాడు. ఇలా చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయి. సంగీతం విషయంలో మంచి పాటలు ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేది. పొలాలు, పల్లెటూరు వాతావరణంలో ఇంకా మంచి సన్నివేశాలు రాసుకొని ఆర్టిస్ట్స్ తో మంచి నటన రాబట్టుకొని ఉండాల్సింది.

కుటుంబ కథ చెప్పేటప్పుడు మొదటి సగంలో ఆ సన్నివేశాలు అస్సలు కనపడవు. హీరో, హీరోయిన్, హీరో ఫాదర్ గ్రామంలో ఇబ్బందులు పడే సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలా కాకుండా ప్రేక్షకులను ఆహ్లాదపరిచే సన్నివేశాలు తయారుచేసుకుని ఉంటే బాగుండేది. అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా అసహజంగానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

కొత్త డైరెక్టర్ రిషి ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ తెర మీద దాన్ని ఆకర్షణీయంగా చూపించడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. షాన్ రెహమాన్ అందించిన పాటలు పెద్దగా బాగోలేవు. సినిమా రెండో సగంలో ఫ్యామిలీ సీన్స్ లో తను ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది. రమణ శ్రీ మరియు రవీంద్ర ఈ చిత్ర నిర్మాతలు. వారు ఈ సినిమాకోసం మంచి బడ్జెట్ ను కేటాయించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయి ప్రకాష్ అంచించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను బాగానే చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు.

తీర్పు:

ప్రస్తుతం ఉన్న కాలంలో సినిమా కథ పాతదే అయినా చూపించే విధానం కొత్తగా ఉండాలి. ఈ సినిమా పాయింట్ బాగున్నా డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయలేకపోయాడు. హీరో హీరోయిన్ నటన బాగున్నా సీన్స్ లో కొత్తదనం లేదు. అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ ఏమోషన్స్ బాగున్నా సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఫ్యామిలీ సినిమాలు నచ్చే వారికి ఈ సినిమా పర్వాలేదు అనిపించినా కొత్తదనం కోరుకునే వారికి మాత్రం నచ్చదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

X
More