కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉండగా, ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే, అదే రోజున ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కర’ కూడా విడుదలకు సిద్ధమవుతోందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు రెండు భారీ చిత్రాలు ఒకే తేదీని లక్ష్యంగా చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ తప్పేలా లేదు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో ఇరు హీరోల అభిమానుల మధ్య అప్పుడే చర్చలు మొదలయ్యాయి.
సూర్య నటించిన ‘కరుప్పు’ ఒక పక్కా రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తుండగా, ధనుష్ ‘కర’ చిత్రం ‘పోర్ తొళిల్’ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ వేసవి పోరులో ఏ హీరో పైచేయి సాధిస్తారో చూడాలి.
