సమీక్ష : గురు – సరికొత్త వెంకీని చూడొచ్చు

సమీక్ష : గురు – సరికొత్త వెంకీని చూడొచ్చు

Published on Mar 31, 2017 12:30 PM IST
Guru movie review

విడుదల తేదీ : మార్చి 31, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : సుధా కొంగర

నిర్మాత : ఎస్. శశికాంత్

సంగీతం : సంతోష్ నారాయణన్

నటీనటులు : వెంకటేష్, రితికా సింగ్

సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖండూస్’ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత తమిళంలో ‘ఇరుద్ది సుట్రు’ గా రీమేకై ఘన విజయం సొంతం చేసుకుని ఇప్పుడు తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘గురు’ గా రూపుదిద్దుకుని ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం మన తెలుగువారిని ఎంతవరకు మెప్పిస్తుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా, బాక్సింగే సర్వస్వంగా భావిస్తూ తనకు నచ్చినట్టు ప్రవర్తించే ఒక ఫెయిల్యూర్ బాక్సర్ ఆదిత్య (వెంకటేష్) ను ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ టీమ్ కు కోచ్ గా నియమిస్తారు. కానీ అతని కోపం, దూకుడుతనం, టాలెంట్, నిజాయితీ నచ్చని కొందరు ఫెడరేషన్ పెద్దలు అతన్ని ఢిల్లీ నుండి వైజాగ్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు.

అలా వైజాగ్ చేరుకున్న కోచ్ ఆదిత్య అక్కడే లోకల్ గా కూరగాయలమ్ముకునే రామేశ్వరి (రితికా సింగ్)ని చూసి ఆమెలోని టాలెంట్ ను గుర్తించి ఎలాగైనా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి తాను సాధించలేని కలను ఆమె ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాడు. కానీ రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు, అలాగే ఫెడరేషన్ లో ఉన్నశత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మారుస్తాడు ? ఏవిదంగా ట్రైన్ చేస్తాడు ? ఎలా వరల్డ్ ఛాంపియన్ ను చేస్తాడు ? అనేదే ఈ సినిమా కథ..

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొత్తంలో ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షించగల అంశం విక్టరీ వెంకటేష్ పాత్ర చిత్రీకరణ. ఒక ఫెయిల్యూర్ బాక్సర్ ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు, అతను కోచ్ గా మారితే తన శిష్యులను ఎలా ట్రీట్ చేస్తాడు, తన లక్ష్యం కోసం ఎలాంటి త్యాగాలను చెయ్యగలడు అనే అంశాలను చాలా బాగా చూపించారు దర్శకురాలు సుధా కొంగర. ఇక ఆ పాత్రలో వెంకటేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు. సినిమా ఆరంభం నుండి చివరి దాకా ఒకే దూకుడును, బాడీ లాంగ్వేజ్ ను మైంటైన్ చేస్తూ ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ను చూస్తే ఒక నిజ జీవితపు వాస్తవ పాత్ర కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంటుంది.

ఇక వెంకీ శిష్యురాలిగా రితికా సింగ్ నటన కూడా కొత్తగా బాగుంటుంది. ఒక హీరోయిన్ ని ఈ తరహా పాత్రలో చూడటం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. స్వతహాగా బాక్సర్ అయిన రితికా ఒక మాస్ నైపథ్యం, అల్లరి ప్రవర్తన కలిగిన అమ్మాయిగా, బాక్సర్ గా చాలా బాగా నటించింది. డైరెక్టర్ సుధా కొంగర ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ ఫెడరేషన్లో నడుస్తున్న కుళ్ళు రాజకీయాలు, ఇతర వాస్తవ అంశాల ఆధారంగా రాసుకున్న కథ దాన్ని చిత్రంగా మలచడానికి తయారుచేసుకున్న కథనం రెండూ బాగున్నాయి.

ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా వెంకీ, రితికా సింగ్ పాత్రల ఎలివేషన్ తో, బలమైన ఈగో కలిగిన ఆ పాత్రల మధ్య రూపొందించబడిన ఆసక్తికర సన్నివేశాలతో బాగానే నడిచింది. మంచి రఫ్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్ కలిగిన ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంది. ఆ సన్నివేశంలో వెంకీ అద్భుతమైన నటనను పండించాడు. ఇక సెకండాఫ్లో వెంకీ పాత్ర చుట్టూ నడిచే డ్రామా, క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది నెమ్మదించిన సెకండాఫ్ గురించి. పాత్రలు మధ్య ఎమోషన్ ను పండించడానికి కాస్త కథనం సాగదీసినట్టు అనిపిస్తుంది. రితికా సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా ఎదిగే విధానాన్ని ఇంకాస్త ప్రభావంతంగా చూపించి ఉండాల్సింది. ఆమెకు వెంకీ ట్రైనింగ్ ఇచ్చే సన్నివేశాలను ఇంకాస్త ఎక్కువగా, బలంగా ఆవిష్కరించి ఉంటే ప్రేక్షకుల్లో ఇంకాస్త ఉత్తేజం ఉత్పన్నమయ్యేది. అలాగే జూనియర్ కోచ్ గా నాజర్ పాత్ర కాస్త అతిగా ఉండి కొన్ని చోట్ల మొహమాట పెట్టింది. ఇక క్లైమాక్స్ ఫైట్ ను బాగానే డిజైన్ చేసినప్పటికీ అందులో వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు ఉండాల్సిన తీవ్రత, వాతావరణం కొంతవరకు లోపించాయి.

సాంకేతిక విభాగం :

‘గురు’ చిత్రం కథ, కథనాలు, ప్రధాన పాత్రల చిత్రీకరణ పరంగా చాలా బలంగా ఉంది. దర్శకురాలు సుధా కొంగర ఆరంభం నుండి చివరి దాకా సినిమాను గమ్యం వైపు ఒకే విధంగా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా నడిపారు. వెంకీని సరికొత్తగా చూపడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు. శక్తివేలు సినిమాటోగ్రఫీ బాగుంది.

సంతోష్ నారాయణన్ పాటలకు అందించిన సంగీతం, కీలక సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వెంకీ పాత్రకు రాసిన డైలాగులు పాత్ర స్వభావాన్నితగ్గట్టు చాలా బాగున్నాయి. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా బాగుంది.

తీర్పు :

విక్టరీ వెంకటేష్ ఇదివరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త పాత్రను ట్రై చేస్తూ చేసిన ఈ సినిమా ఆయనకు మంచి సక్సెస్ ను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి చాలా దగ్గరగా, ఆలోచింపజేసేలా ఉండే కథ, కథనాలు, ప్రధానమైన వెంకీ, రితికా సింగ్ పాత్రల చిత్రీకరణ, గురు శిష్యుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా, ఈగో సంబంధిత సన్నివేశాలు, దర్శకురాలు సుధా కొంగర టేకింగ్ ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ కాగా కాస్త నెమ్మదించిన సెకండాఫ్ కథనం, తీవ్రత లోపించిన క్లైమాక్స్ ఫైట్ వంటివి ఇందులో చిన్న చిన్న బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ మొదటి తెలుగు స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇది వరకు చూడని వెంకీని మన కళ్ళ ముందుంచడమేగాక మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని కూడా ఇస్తుంది.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు