సమీక్ష : దేవుడు చేసిన మనుషులు – పూరి చెప్పిన ‘తొక్క’ కథ

సమీక్ష : దేవుడు చేసిన మనుషులు – పూరి చెప్పిన ‘తొక్క’ కథ

Published on Aug 16, 2012 8:15 AM IST
విడుదల తేది : 15 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.25 /5
దర్శకుడు : పూరి జగన్నాధ్
నిర్మాతలు : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
సంగీతం : రఘు కుంచె
నటీనటులు : రవితేజ, ఇలియానా

రవితేజని హీరో చేసి ఆ తరువాత స్టార్ హీరో ఇమేజ్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ఇప్పటి వరకు రవితేజతో నాలుగు సినిమాలు తీసాడు. మొదటి మూడు హిట్ సినిమాలు ఇచ్చిన వీరు నేనింతే సినిమాతో నిరాశ పరిచారు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐదవ సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ విడుదలకి ముందు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించ లేకపోయింది. ఈరోజే విడుదలైన ఈ సినిమా వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజకి హిట్ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాధ్ చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి అంటూ కథేమి లేదు. అక్షయ తృతీయ రోజు అలిగిన లక్ష్మి దేవి (కోవై సరళ)ని బుజ్జగించడానికి విష్ణు మూర్తి (బ్రహ్మానందం) చెప్పిన కథతో ఈ సినిమా కథ మొదలవుతుంది. హైదరాబాదులో అనాధగా పెరిగి మధ్యవర్తిగా పనిచేసే రవితేజ (రవితేజ)కి, బ్యాంకాక్లో అనాధగా పెరిగి టాక్సీ డ్రైవరుగా పనిచేసే ఇలియానా (ఇలియానా) మధ్య ప్రేమ పుట్టించడానికి పనిలేని పాపయ్య తో అరటి ‘తొక్క’ వేయిస్తాడు విష్ణు మూర్తి. ఆ తొక్క ద్వారా రవితేజ బ్యాంకాక్ వెళతాడు. అక్కడ ఇలియానాని కలుస్తాడు. ఇద్దరు ప్రేమించుకుని కలుసుకునే సమయంలో కొట్టుకుని విడిపోతారు. తొక్క వేస్తే వారిద్దరి ప్రేమ సక్సెస్ కాలేదని ‘తొక్క’ వేయకుండా కథని మరోలా నడిపిస్తాడు. చివరికి వారిద్దరు ఎలా కలిసారు అనేది మిగతా కథ. ఈ అరటి తొక్క గోల ఏంటి అనుకుంటున్నారా! అంతా ఆ దేవుడు (పూరి) చేసిన లీల.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా నటించాడు. ఆయన గత మూడు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బెటర్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇలియానా నటనలో ఏ మాత్రం మార్పు లేదు. నువ్వంటే చాలా ఇష్టమే, నువ్వేలే నువ్వేలే పాటల్లో అందంగా కనపడింది. ప్రకాష్ రాజ్ మతిపరుపు డాన్ పాత్ర విభిన్నంగా ఉండటం దానికి అయన పెర్ఫార్మన్స్ తోడవడంతో బాగానే పండింది. బ్రహ్మానందం, కోవై సరళ పాత్రలకి పూరి పంచ్ డైలాగులు తోడవడంతో వారి మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. గోలి పాత్రలో అలీ నవ్వించే ప్రయత్నం చేసాడు. సుబ్బరాజు పాత్రలో సుబ్బరాజు, ఫిష్ వెంకట్ రొటీన్ రొటీన్.

మైనస్ పాయింట్స్ :

పూరి జగన్నాధ్ ఈ సినిమా కాన్సెప్ట్ ని 12 బి అనే తమిళ సినిమా నుండి ఇన్స్పైర్ అయి రాసుకున్నాడు. పూరికి స్క్రీన్ప్లే మీద రోజు రోజుకి పట్టు తగ్గుపోతుంది అని ఈ సినిమా చుసిన తరువాత స్పష్టంగా అర్ధమవుతుంది. ఫస్టాఫ్ వరకు ఎంటర్తైన్మెంట్ పర్వలేదనిపిస్తూ సాగినా సెకండాఫ్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా విసుగు తెప్పించింది. ఇలియానా విగ్ తో చిరాకు తెప్పించింది. మధ్యలో అలీ, లక్ష్మి దేవి సైడ్ ట్రాక్ మొదట్లో పర్వాలేదనిపించినా రాను రాను విసుగు వచ్చింది. సంతోషకరమైన విషయం ఏంటంటే అలీ డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోవడం. గ్యాబ్రియేలతో చేయించిన డిస్టబ్ చేత్తున్నాడే పాట కూడా ఆకట్టుకోలేదు. రఘు కుంచె సంగీతంలో ఆకట్టుకొనే పాటలు లేకపోగా నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. రవితేజ, ఇలియానా మధ్య బలమైన ప్రేమ సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకుడు కనీసం కామెడీ అయినా ఉంటుందేమో అని పక్క వైపు చూస్తే పూరి అక్కడ కూడా మొండి చేయి చూపించాడు. క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్, ఇలియానా మధ్య అన్నా, చెల్లెలు సెంటిమెంట్  సీన్స్ చూడకుండానే ప్రేక్షకులు బైటికి వెల్లిపోయేలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

ఈ విభాగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ గురించి. బ్యాంకాక్ ని ప్రతి సినిమాలో చూస్తున్నా ఈ సినిమాలో ఇంకా బాగా చూపించారు. మరీ ముఖ్యంగా నువ్వంటే చాలా ఇష్టమే, నువ్వేలే నువ్వేలే పాటల్లో కెమెరామన్ పనితనం కనిపిస్తుంది. రెండు గంటల చిన్న సినిమానే కాబట్టి ఎడిటర్ కి కూడా పెద్దగా పని లేకుండా పోయింది. డైలాగుల్లో పూరి మార్కు పంచులు లేవు.

తీర్పు:

రవితేజ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు మినిమం గ్యారంటీ అని ఆశిస్తారు. దేవుడు చేసిన మనుషులు కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించిన వెళ్ళిన వారికి ‘తొక్క’ కథ చెప్పి పంపించాడు. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించినా సెకండాఫ్ నుండి ప్రేక్షకుడిని చివరి వరకు సీట్లో కుర్చోపెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ఈ తొక్క కథని అరటి పండు తింటూ టీవీలో చూసుకోవడం బెటర్.

123తెలుగు.కాం రేటింగ్: 2.25/5

అశోక్ రెడ్డి. ఎమ్


Click Here For ‘ Devudu Chesina Manushulu’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు