సమీక్ష : లవర్స్ – సప్తగిరి ఎంటర్టైనర్

సమీక్ష : లవర్స్ – సప్తగిరి ఎంటర్టైనర్

Published on Aug 16, 2014 1:50 PM IST
 lovers విడుదల తేదీ : 15 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : హరినాథ్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ – బి. మహేంద్ర బాబు
సంగీతం : జె.బి
నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత…

అతి తక్కువ బడ్జెట్ లో నూతన తారలతో సినిమాలు తీసి దర్శకుడిగా వరుసగా విజయాలు అందుకున్న మారుతి సమర్పణలో హరినాథ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘లవర్స్’. ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమాతో సక్సెస్ అందుకున్న సుమంత్ అశ్విన్, ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తేజస్వి, షామిలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మారుతి ఈ సినిమాకి సమర్పకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ని కూడా అందించాడు. టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి తీసిన ఈ ‘లవర్స్’ అనే చిన్న సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రతి సినిమాకి ఓ పాయింట్ అనుకొని కథని రాసుకుంటారు. కానీ ఈ సినిమా కోసం ఓ పాయింట్ ని కూడా అనుకోకపోవడం విశేషం. మరి రెండుగంటలు మాకు ఏమి చూపించారు? అన్న అనుమానం కలగచ్చు. అందుకే వారు మాకు చూపించిన కథని మీకు సింపుల్ గా చెబుతా…

ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సిద్దు(సుమంత్ అశ్విన్) గీత(తేజస్వి) ప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమ మధ్యలోనే బ్రేకప్ అయిపోతుంది. ఆ తర్వాత సిద్దు సౌమ్య(షామిలి)ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కుడా కొద్ది రోజుల్లోనే బ్రేకప్ అయిపోతుంది. కట్ చేస్తే సిద్దు రెండు లవ్ స్టోరీస్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం చిత్ర బాలసుబ్రమణ్యం(నందిత). ఇది జరిగిన కొద్ది రోజులకి సిద్దు ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరతాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆ ప్రేమలో కూడా సిద్దు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు ఏమిటి? అసలు చిత్ర బాలసుబ్రమణ్యం ఎందుకు సిద్దు లవ్ స్టోరీస్ ని ఫెయిల్ అయ్యేలా చేసింది? అసలు సిద్దు – చిత్ర బాలసుబ్రమణ్యంకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘లవర్స్’ సినిమాకి వన్ అండ్ ఓన్లీ మేజర్ హైలైట్ అంటే అది సెకండాఫ్, అందులో వచ్చే సప్తగిరి కామెడీ మాత్రమే.. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. కొన్ని సీన్స్ మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాకి అసలైన హీరో సప్తగిరి అని చెప్పడంలో ఎలాంటి అతిశాయోక్తి లేదు. ఈ సినిమా పరంగా సప్తగిరిని కమెడియన్ అనడం కంటే హీరో అనే అనాలి. ఎందుకంటే సెకండాఫ్ లో మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేది సప్తగిరి మాత్రమే.. అతని పాత్ర పరిచయం అయినప్పటి నుంచి చివర్లో అతని పాత్ర మాయమయ్యే దాకా ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. అమ్మాయిలంటే అస్సలు పడని పాత్ర చేసిన సప్తగిరిపై షూట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ఆరడుగుల బుల్లెట్ స్పూఫ్, ప్రేమకథా చిత్రమ్ కంటిన్యూ సీక్వెన్స్ కడుపుబ్బా నవ్విస్తుంది.

సప్తగిరి లేకపోతే లవర్స్ అనే సినిమా ప్రాణం లేని దేహంలా ఉంటుంది. పెద్ద సినిమాల విజయంలో బ్రహ్మానందం ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాడో ఇలాంటి చిన్న సినిమాల విజయంలో అంతే కీ రోల్ సప్తగిరి పోషిస్తున్నాడు. ఇలా ఎందుకు అన్నాను అనేది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇక హీరో పక్కన ఫ్రెండ్ పాత్రలో సినిమా మొత్తం ట్రావెల్ అయిన సాయి బాగానే నవ్వించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీన్స్, సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి కాంబినేషన్ సీన్స్ లో ఇద్దరూ చాలా బాగా నవ్వించారు.

ఇక అసలు హీరోగా చేసిన సుమంత్ అశ్విన్ తన పాత్రకి తగ్గ నటనని కనబరిచాడు. సుమంత్ సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగా చేసాడు. అలాగే ఇందులో కనిపించిన నలుగురు హీరోయిన్స్ లో లీడ్ రోల్ చేసింది నందిత. సీరియస్ మరియు టిపికల్ లేడీ పాత్రలో నందిత మంచి నటనని కనబరిచింది. అలాగే చూడటానికి కూడా చాలా బాగుంది. చిన్న పాత్రలే అయినా కథా పరంగా ఎంతో కీలకమైన పాత్రల్లో నటించిన తేజస్వి, షామిలి, చాందినిలు తమ పాత్రలకు న్యాయం చేసారు.

చర్చ్ ఫాదర్ పాత్రలో ఎంఎస్ నారాయణ నటన బాగుంది. అలాగే సినిమాలోని అన్ని పాటలను బాగా షూట్ చేసారు. విజువల్స్ పరంగా సాంగ్స్ చూడటానికి చాలా బాగున్నాయి. సినిమా రన్ టైం 2 గంటల 10 నిమిషాలే కావడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది.

మైనస్ పాయింట్స్ :

పైన కథలో చెప్పినట్టు.. చెప్పుకోవడానికి స్టొరీ లైన్ అనేది లేకపోవడమే ఈ సినిమాకి మొదటి మైనస్. మారుతి ఈ సినిమాని మొత్తం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ తోనే లాక్కొని రావాలని ట్రై చేసారు. కానీ వాళ్ళదగ్గర చెప్పడానికి పాయింట్ ఏమీ లేకపోవడం వలన ఫస్ట్ హాఫ్ ని ఏదేదో సీన్స్ తో అల్లు కోవాల్సి వచ్చింది. అందువల్ల ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వకపోవడం వలన చాలా బోరింగ్ గా ఉంటుంది.

పైన చెప్పినట్టు పాటల విజువల్స్ బాగుంటాయి కానీ సినిమాలో వచ్చే ఒక్క పాట కూడా సందర్భానుసారంగా కాకుండా ఎలా పడితే అలా రావడం వలన ఆడియన్స్ కి బోర్ కొట్టించడమే కాకుండా సినిమా వేగాన్ని మరింత తగ్గిస్తాయి. అలాగే నలుగురు హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ వారికి వాడిన మేకప్ మరియు కాస్ట్యూమ్స్ వారి పాత్రలకి అస్సలు సెట్ అవ్వలేదు. క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నా సరైన జస్టిఫికేషన్ మాత్రం లేదు. సినిమాలో మొత్తం నాలుగు లవ్ ట్రాక్స్ చూపించినప్పటికీ ఒక్క ట్రాక్ లో కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కెమిస్ట్రీ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా ది బెస్ట్ అన్నవి చెబుతాను. తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం.. మల్హర్ భట్ జోషి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమా మేజర్ హైలైట్స్ లో ఒకటి. హైదరాబాద్ లో తనకి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని చాలా గ్రాండ్ గా చూపించాడు. ఇక జెబి అందించిన పాటలు బాగున్నాయి, కానీ వాటిని సినిమాలో సరిగా వాడుకోలేదు. ఇకపోతే తను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరో మేజర్ హైలైట్. ఉద్ధవ్ ఎడిటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని చాలా వరకూ కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త వేగంగా అనిపించేది ఏమో..

ఇప్పటికే పలు సినిమాలతో తన టాలెంట్ నిరూపించుకున్న మారుతి ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించాడు. కథ – అసలు కథే లేదుగా, స్క్రీన్ ప్లే – కథ లేకుండా స్క్రీన్ ప్లే అంటే కొంతవరకే సక్సెస్ అవుతారు, అందువల్లే ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయ్యారు, సెకండాఫ్ లో సక్సెస్ అయ్యారు. డైలాగ్స్ – సప్తగిరికి రాసిన డైలాగ్స్ తప్ప మిగతా ఏవీ చెప్పుకునే స్థాయిలో లేదు. ఇక ఎప్పటిలానే మారుతి మార్క్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అందులో కొన్నిటిని సెన్సార్ వారు మ్యూట్ చేయడం కూడా జరిగింది. హరినాథ్ మొదటి సినిమాతో చెప్పుకోదగ్గ స్థాయిలో ముద్ర వేసుకోలేకపోయాడు. సూర్యదేవర నాగవంశీ – బి. మహేంద్ర బాబు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

లో బడ్జెట్ లవ్ ఎంటర్టైనర్స్ తీయడంలో ఓ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న మారుతి కర్త, కర్మ, క్రియగా వచ్చిన ‘లవర్స్’ సినిమా చెప్పుకునేంత లవ్లీగా లేదు. సినిమా అంటే మూడు ఉండాలి అవే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, సిర్ఫ్ ఎంటర్టైన్మెంట్, అలాగే ‘లవర్స్’ సినిమా అంటే చెప్పుకోవాల్సినవి మూడు, అవే సప్తగిరి, సప్తగిరి, సిర్ఫ్ సప్తగిరి. సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి ఎంటర్టైన్మెంట్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే స్టొరీ లైన్ లేకపోవడం, ఫస్ట్ హాఫ్, సందర్భం లేకుండా వచ్చే పాటలు ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. లాంగ్ వీకెండ్ టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం, దానికి మారుతి మార్క్ తోడవ్వడం వలన ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు