సమీక్ష : డోర – భయపెట్టలేదు కానీ, థ్రిల్ చేసింది !

సమీక్ష : డోర – భయపెట్టలేదు కానీ, థ్రిల్ చేసింది !

Published on Mar 31, 2017 4:30 PM IST
Dora movie review

విడుదల తేదీ : మార్చి 31, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : దాస్ రామసామి

నిర్మాత : మల్కాపురం శివకుమార్

సంగీతం : వివేక్ మెర్విన్, సొలొమన్

నటీనటులు : నయనతార

గ్లామర్ రోల్స్ తగ్గించి కథాపరంగా సినిమాలే చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే ‘డోర’. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి అంచనాలతో ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

పారిజాతం (నయనతార) అనే అమ్మాయి బంధువులతో ఛాలెంజ్ చేసి జీవితంలో ఎదగడానికి తన నాన్నతో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటుంది. అందుకోసం ఒక వెరైటీగా ఉంటుందని ఒక పాత కాలపు కారును కొనుగోలుచేసి బిజినెస్ మొదలుపెడుతుంది. కానీ ఆ కారు కొన్నప్పటి నుండి ఆమెకు సమస్యలు మొదలవుతాయి.

తీరా చూస్తే ఆ కారులో ఒక ఆత్మ ప్రవేశించిందని, దాని కోరిక తీరే వరకు అది తనను వదిలిపెట్టదని పారిజాతం తెలుసుకుంటుంది. అసలు ఆ కారులో ప్రవేశించిన ఆత్మ ఎవరు ? అది పారిజాతాన్నే ఎందుకు ఎంచుకుంది ? ఆ ఆత్మ కోరికేమిటి ? చివరికి పారిజాతం ఆ సమస్యకు ముగింపేమిటి ? అనేదే ఈ సినిమా కథ..

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి ప్రధాన బలం నయనతారే అని చెప్పాలి. సినిమా మొత్తం చాలా డీసెంట్ గా, గ్లామరస్ గా కనిపిస్తూ ఆమె ప్రదర్శించిన నటన చాలా బాగుంది. ఆరంభం నుండి చివరి దాకా సినిమాని తన భుజాలమీదే మోసింది నయన్. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో నడిచే అపరిచితుడు తరహా సన్నివేశంలో, సెకండాఫ్లో తన కర్తవ్యాన్ని నిర్వహించే సన్నివేశాల్లో ఆమె నటనను చూస్తే లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఆమెకు సరైందనే అనిపిస్తుంది. ఇక కథ విషయానికొస్తే టైటిల్ పోస్టర్ చూడగానే ఇదొక కారులో దూరిన ఆత్మ కథ అని ఇట్టే అర్ధమయినా కూడా ఆ ఆత్మ ఎవరిదనే చిన్న విషయం మంచి థ్రిల్ ను ఇస్తుంది.

అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే ఆ ఆత్మ కథ కూడా కాస్త ఎమోషనల్ గా కనెక్టవడమే కాక రీజనబుల్ గా కూడా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు దాస్ రామసామి కథలోని నయనతార, కారును ఆవహించిన ఆత్మ, పోలీసులు అనే మూడు ప్రధానమైన అంశాలను చాలా తెలివిగా కనెక్ట్ చేస్తూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేని కథనాన్ని రాసుకుని అంతే బాగా దాన్ని తెరపై ఆవిష్కారించాడు. అలాగే కారులో ప్రవేశించిన ఆత్మ కారుతో చేసే పనులను కూడా ఆసక్తికరంగా చిత్రీకరించి ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు దర్శకుడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని అసలు కథ సెకండాఫ్లో గానీ మొదలుకాకపోవడంతో ఫస్టాఫ్ అంతా చాలా భారంగా గడించింది. పోలీసులకు సంబందించిన సన్నివేశాల మినహా నయనతారకు, వాళ్ళ నాన్నకు మధ్య నడిచే అనవసరమైన సీన్లు, కారు పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు చాలా విసుగుపుట్టించాయి. ఒకే అంశాన్ని వేరు వేరు సన్నివేశాలతో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారనే భావన కలిగింది. ఈ ఫెయిల్యూర్ ఫస్టాఫ్ వలనే సినిమా అంతిమ ఫలితం కూడా చాలా వరకు దెబ్బతింది. అలాగే ఆత్మకు సంబందించిన సినిమా కాబట్టి ప్రేక్షకుడు సాధారణంగానే కాస్త హార్రర్ కంటెంట్ ను ఆశిస్తాడు. కానీ ఇందులో అలాంటివేమీ ఉండవు.

ఇక సెకండాఫ్లోనే అసలు కథ మొదలై సినిమా కాస్త ముందుకెళ్ళగానే ఆ తర్వాత ఏం జరుగుతుందో మన కళ్ళ ముందు కనిపించేస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చే ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడు ఇప్పుడు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని ఊహించేయగలగడంతో దర్శకుడు సన్నివేశాల్ని కొత్త తరహాలోనే చిత్రీకరించినా కూడా పూర్తి స్థాయి ఎగ్జైట్మెంట్ తీసుకురాలేకపోయాడు. ఇక చిత్ర క్లైమాక్స్ కూడా ఏమాత్రం భిన్నంగా లేకుండా రొటీన్ గానే ఉంటూ కాస్తంత సాగదీసినట్టుగా కూడా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు దాస్ రామసామి కాస్త వెరైటీగా ఉండే ప్లాట్ ను తీసుకుని దానికి మంచి కథనం అందివ్వడంలో ఫస్టాఫ్లో విఫలమైనా కూడా సెకండాఫ్లో విజయం సాధించాడు. అలాగే కారుకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణలో కూడా తన మెళకువలను ఉపయోగించి బాగానే తీశాడు అనిపించాడు. సినిమాకు ముఖ్యమైన నయనతార నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో కూడా రామసామి సక్సెస్ అయ్యాడు.

ఇక దినేష్ కృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ మెర్విన్, సొలొమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాన్నించ్చింది. గోపి కృష్ణ ఎడిటింగ్ బాగున్నా ఫస్టాఫ్లో ఎక్కువైన కొన్ని అనవసరపు సీన్లను తొలగించి ఉంటే బాగుండేది. మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆమె కేరీర్లో ఒక చెప్పుకోదగిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. నయనతార నటన, థ్రిల్లింగా, ఎమోషనల్ గా అనిపించే సెకండాఫ్ కథ, రామస్వామి టేకింగ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా విసుగుపుట్టించే ఫస్టాఫ్, హర్రర్ కంటెంట్ పూర్తిగా మిస్సవడం, ఊహాజనితమైన సెకండాఫ్ కథనం, అంత ఆసక్తికరంగా, కొత్తగా ఏమీ లేని క్లైమాక్స్ మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘డోర’ భయపెట్టదు కానీ థ్రిల్ చేస్తుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు