సమీక్ష : సైకో – సైకోయిజంకి అద్దం పట్టే సినిమా..

సమీక్ష : సైకో – సైకోయిజంకి అద్దం పట్టే సినిమా..

Published on Jun 21, 2013 10:30 AM IST
PSYCHO విడుదల తేదీ : 21 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : కిషోర్ భార్గవ్
నిర్మాత : వివేకానంద్ అహుజ
నటీనటులు : నిషా కొఠారి, మిలింద్ గునాజ్


ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టించి లేదా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘సైకో’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో బయట ప్రపంచంలో అమ్మాయిల్ని సైకో మనస్తత్వం ఉన్న వారు ఎలా హింసిస్తున్నారు అనేదాన్ని చూపించారు. నిషా కొఠారి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మిలింద్ గునాజ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే రామ్ గోపాల్ వర్మ అందిస్తే డైరెక్షన్ ఆయన శిష్యుడు కిషోర్ భార్గవ్ చేసాడు. ఇంతకీ ఈ సైకో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

మీరా(నిషా కొఠారి) ఓ ఉద్యోగం చేసుకుంటూ తన ఫ్యామిలీ పోషిస్తూ సాధారణమైన అమ్మాయి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. మీరాకి తన ఆఫీసులో పనిచేసే శేఖర్, అయేషా మంచి ఫ్రెండ్స్. ఇలా సాఫీగా సాగిపోతున్న మీరా జీవితంలోకి ఓ నిఖిల్/ సందీప్ శర్మ ప్రవేశిస్తాడు. మొదట మీరాతో కాస్త పరిచయం ఏర్పరుచుకున్న నిఖిల్ ఆ తర్వాత మీరాని నాతో సినిమాకి రా? నాతో చాట్ చెయ్? అని ఇబ్బంది పెడుతూ కాస్త రూడ్ గా బిహేవ్ చేస్తుంటాడు. అతని టార్చర్ తట్టుకోలేక దూరంగా పెట్టడంతో అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంటాడు.

దాంతో మీరా ఈ విషయం శేఖర్ కి చెప్పి సాయం అడుగుతుంది. దాన్ని సీరియస్ గా తీసుకున్న శేఖర్ తనకు తెలిసిన సిటీ కమీషనర్(మిలింద్ గునాజ్) కి కంప్లైంట్ చేస్తాడు. మొదట్లో సీరియస్ గా తీసుకొని కమీషనర్ అనుకోకుండా ఓ సంఘటన జరగడంతో కేసుపై దృష్టి పెడతాడు. అప్పుడే కథలో మెయిన్ ట్విస్ట్. కట్ చేస్తే క్లైమాక్స్.అసలు కమీషనర్ ఊహించని సంఘటన ఏం జరిగింది? ఆ ట్విస్ట్ ఏంటి? చివరికి ఆ సైకో వల్ల మీరాకి ఏమన్నా అయ్యిందా? లేక చివరికి సైకోనే చనిపోయాడా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో సైకోగా ‘నిఖిల్’ పాత్ర పోషించిన నటన బాగుంది. తన హావ భావాలతో సైకో పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసాడు. నిషా కొఠారి నటన బాగుంది. ముఖ్యంగా భయపడే సన్నివేశాల్లో, టెన్షన్ పడే సన్నివేశాల్లో బాగా చేసింది. శేఖర్ పాత్ర పోషించిన అతని నటన కూడా ఓకే. కమీషనర్ పాత్రలో మిలింద్ గునాజ్ పాత్ర చాలా చిన్నది. సినిమా నిడివి తక్కువ కావడం చెప్పదగిన ప్లస్ పాయింట్. అలాగే వర్మ ఎంచుకున్న స్టొరీ లైన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. రామ్ గోపాల్ వర్మ ‘గో ప్రో’, ‘5డి’ టెక్నాలజీలను వాడి రోగ్ మెథడాలజీలో తీసిన ‘డిపార్ట్ మెంట్’ సినిమా ఘోర పరాజయం పాలైనా, ఆ సినిమాలో కెమెరాని ఉపయోగించిన తీరుకి తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నా సరే మేం వర్మ శిష్యులం అని నిరూపించుకోవడానికి మళ్ళీ అదే రోగ్ మెథడాలజీని వాడి వర్మ శిష్య బృందం బొక్క బోర్లా పడ్డారు. సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లాంటివి ఎలా ఉన్నా కెమెరా యాంగిల్స్ వల్ల ప్రేక్షకులకి చిరాకుతో పాటు కళ్ళు కూడా తిరిగేలా చేస్తాయి. నాకు తెలిసి ప్రేక్షకులు సినిమా పూర్తయ్యేంత వరకూ థియేటర్లో కూర్చునే అవకాశం తక్కువ.

వాస్తవంలో నుంచి తీసుకున్న కథలను ఎంతో సస్పెన్స్ ఉండేలా స్క్రీన్ ప్లేని టఫ్ గా ఉండేలా చూసుకోవాలి, కానీ ఆ రెండూ చాలా వీక్ అయ్యాయి. ఎంత వీక్ అంటే ఫస్ట్ హాఫ్ నుండి సెకండాఫ్ చివరి వరకూ ఊహాజనితంగా ఉంటుంది. ప్రతి సారి సైకో హాయ్ అని భయపెడుతుంటాడు. సినిమా అయ్యాక బయటవచ్చేటప్పుడు పక్కని వాళ్ళని పలకరిస్తే వాళ్ళు కూడా సైకోలా హాయ్ అంటున్నారంటే దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఆ ఒక్క పదంతో ఎంత టార్చర్ పెట్టారో. క్లైమాక్స్ లో అయితే సైకోయిజంలో పరాకాష్టని చూపించారు. సినిమాలో ఏదో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఏదో ఒక మెసేజ్ ఇస్తాడేమో అనుకుంటే చివరికి మనం ఎలా సైకోలుగా మారాలో చూపించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

క్లైమాక్స్ సీన్స్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో నవ్వుకోవడానికి ఒక్క కామెడీ బిట్ కూడా ఉండదు. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బాగా అనిపించినా ఆ ఫీలింగ్ ని రోగ్ మెథడ్ కొద్ది సెకన్లు కూడా ఉండనివ్వలేదు. మిలింద్ గునాజ్ లాంటి పెద్ద నటున్ని సినిమాలో పెట్టుకొని పెద్దగా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక విభాగం

ఇది వరకే చెప్పినట్టు సినిమాటోగ్రఫీ డిపార్ట్ మెంట్ వాళ్ళకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో లాగా నెగటివ్ మార్క్స్ ఉంటే 100 కి 200 నెగటివ్ మార్క్స్ ఇవ్వొచ్చు. అది కూడా ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ ఈ సినిమా తీయడం, దానికి మరో ఇద్దరి ఎడిటర్స్ కత్తిరింపులు వేయడంతో సినిమాకి నాలుగు దిక్కులా వినాశనమే ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ అందించిన కథ బాగున్నా, స్క్రీన్ ప్లే పెద్ద మైనస్. ఇక దర్శకత్వానికి వస్తే కిషోర్ భార్గవ్ తొలి సినిమాకి ఆడియన్స్ నుంచి కేవలం 35 మార్కులు తెచ్చుకుని పాస్ కూడా కాలేకపోయాడు.

అసలు డైరెక్టర్ కి క్లారిటీ ఉందో? లేదో? గానీ చాలా సన్నివేశాల్లో నటీనటుల మధ్య సంభాషణలు జరుగుతుంటే, వేరే ఇతర సన్నివేశాలు జరుగుతున్నప్పుడు వారి హావ భావాలను చూపించకుండా డైనింగ్ టేబుల్ కింద కెమెరాలు పెట్టడం, గోడకి కెమెరాలు పెట్టడం చిరాకు తెప్పిస్తుంది. నటీనటుల హావ భావాలకంటే ఇలాంటివి చూపించాలని డైరెక్టర్ కి ఎందుకనిపించిందో? ఆయనకన్నా తెలుసో లేదో. డైలాగ్స్ జస్ట్ ఓకే. సాంగ్స్ లేవు ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. రీ రికార్డింగ్ బాగుంది కానీ కొన్ని సన్నివేశాల్లో నటీనటుల వాయిస్ ని డామినేట్ చేసింది.

తీర్పు :

సైకో – టైటిల్ కి తగ్గట్టు ఉంది. ఈ సినిమా చూస్తే మీరు సైకోలుగా మారే అవకాశం ఉంది. వర్మ చెప్పాలనుకున్న స్టొరీ లైన్ చివరికి పట్టాలు తప్పడంతో సినిమా కూడా పట్టాలు తప్పి చేరుకోవాల్సిన గమ్యాన్ని మరచి ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరిగా సైకో వర్మ డిపార్ట్ మెంట్ నుండి నుంచి వచ్చిన మరో టార్చర్ సినిమా. ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిదని నా సలహా..
రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు