
ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ బాగుంది. ఇటీవల ప్రయోగాత్మక సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే కోవలో వస్తున్న మరో సినిమా ‘ఒక రాత్రిలో ఇద్దరు అమ్మాయిలు’. ఓ తమిళ సినిమాకు అనువాదం ఇది. టైటిల్ కి తగ్గట్టు సినిమా అంతా ఒక్క రాత్రిలో జరుగుతుంది. సాయంత్రం ప్రారంభమై తెల్లవారుజామున ముగుస్తుంది. ఆ రాత్రి కొందరి జీవితాలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ప్రధాన కధాంశం. డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పూజా రామచంద్రన్, మాళవిక, వినోద్ కృష్ణ నటీనటులుగా రూపొందిన ఈ సినిమాకు బాలాజీ కె కుమార్ దర్శకత్వం వహించారు. గిరీష్ గోపాలకృష్ణ సంగీత దర్శకుడు. కింగ్స్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ సినిమాను నిర్మించింది. బుధవారం సాయంత్రం సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు, అతిధులు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.