ప్రముఖ నటుడు అలీ.. నిర్మాతగా మారనున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటివరకూ కమెడియన్‌గా వందల సినిమాల్లో నటించిన అలీ, హీరోగానూ 50 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన నిర్మాత అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలన్న తన కోరికను గతంలో వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడదే క్రమంలో పవన్‌తో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. పవన్, అలీల జోడీకి సినిమాల్లోనే కాక బయటకూడా మంచి పేరుంది. వీరిద్దరూ సహ నటులే కాక మిత్రులు కూడా. పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన బండ్ల గణేష్‌ను నిర్మాతగా పరిచయం చేసింది పవర్ స్టారే. అలాగే, అలీని కూడా నిర్మాతను చేయనున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న గబ్బర్ సింగ్ 2, దాసరి నారాయణరావుతో సినిమాలు పూర్తవ్వగానే.. అలీ, పవన్‌ల సినిమా తెరకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలీ, ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నారు. అలీ నిర్మాణ సంస్థపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
