
సినీ పరిశ్రమలో పని చేసే వాళ్ళకైనా, సినిమాల్లో పని చేయాలనుకునే వాళ్ళకైనా తామెంతో ఇష్టపడి, ప్రేరణగా పొంది, వాళ్ళను గురువులుగా స్వీకరించిన వారితో కలిసి పనిచేయడం అనేది కల. ఇప్పుడా కలల ప్రపంచాన్ని నిజ జీవితంలో ఆస్వాధిస్తున్నారు.. హీరో నాని. ‘మీరు సినిమాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరు ?’ అని అడిగినప్పుడు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాని చెప్పే పేరు.. మణిరత్నం. భారతదేశంలోని దిగ్గజ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మణిరత్నంతో పని చేయాలన్నది చాలామంది కల. గతంలో అద్భుత చిత్ర రాజసాలను తీసిన మణిరత్నం.. ఈమధ్య కాస్త నెమ్మదించారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ‘ఓకే కన్మణి’ ( తెలుగులో ఓకే బంగారం) ద్వారా మళ్ళీ హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం హీరో నానిని, ‘ఓకే బంగారం’ హీరో దుల్కన్ సల్మాన్‌కు డబ్బింగ్ చెప్పవలసిందిగా మణిరత్నం కోరారు. తన అభిమాన దర్శకుడు అడిగేసరికి నాని కాదనకుండా ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఓకే బంగారం ట్రైలర్‌ను చూసినవారంతా నాని దుల్కన్ పాత్రకు అద్భుతమైన వాయిస్ ఇచ్చారని కితాబిచ్చారు. ఇక డబ్బింగ్ సందర్భంగా.. హీరో నాని, మణిరత్నంలు కలిసి దిగిన ఫోటో ఇది.