నిఖిల్.. సినిమాని తన భుజాలపై మోశారు : మల్కాపురం శివకుమార్

surya-vs-surya
రెండు వరుస హిట్లతో జోరుమీదున్న నిఖిల్ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సూర్య vs సూర్య’. సురక్ష ప్రొడక్షన్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ సినిమాని నిర్మించారు. గత వారం విడుదలైన ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి వారం కలెక్షన్లు కూడా నిఖిల్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్‌గా నిలిచాయి. ఇక సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నిర్మాత మల్కాపురమ్ శివకుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినిమా విజయం మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచింది. దర్శకుడు కార్తీక్ తానేమనుకున్నాడో దాన్ని తెరపై ఆవిష్కరించారు. ఇక హీరో నిఖిల్ అయితే తన భుజాలపై సినిమాని మోశారు” అని అన్నారు.

“మా సంస్థ ద్వారా విడుదలైన మొదటి సినిమాకే ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలై వారం దాటినా ఇప్పటికీ 80% ఆక్యుపెన్సీతో సినిమా దూసుకుపోతోంది. ఒక కొత్తదనమున్న సినిమాని ప్రేక్షకుడు ఎప్పుడూ ఆదరిస్తాడని మళ్ళీ రుజువైంది. ప్రేక్షక దేవుళ్ళందరికీ మా తరపున కృతజ్ఞతలు. దర్శకుడు ఏదైతే చెప్పాడో అదే తీశారు. స్వయంగా ఆయన సినిమాటోగ్రాఫర్‍ కూడా కావడంతో ప్రతీ సన్నివేశాన్ని అందంగా ఆవిష్కరించారు. ఇక హీరో నిఖిల్ గురించైతే ఎంత చెప్పినా తక్కువే. సినిమాని తన భుజాలపై మోశారనే చెప్పుకోవాలి. సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరూ పూర్తి న్యాయం చేశారు. మున్ముందు కొత్తదనమున్న సినిమాను ఇంకా చేస్తాం. సినిమా విడుదల తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా టీమ్ సెల్ఫీ టూర్‌ని విజయవంతంగా చేపట్టింది. మమ్మల్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు” అని చెబుతూ మల్కాపురం శివకుమార్ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు

Exit mobile version