నటి సుహాసినికి అరుదైన గౌరవం!

suhasini
ప్రముఖ నటి ‘సుహాసిని మణిరత్నం’కు అరుదైన గౌరవం లభించింది. ది గ్రాండ్ డచీ ఆఫ్ లగ్జెంబర్గ్ (లగ్జంబర్గ్)కు ఆమెను గౌరవ కౌన్సిల్ మెంబర్‍గా నియమించారు. దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 17న చెన్నైలో వైభవంగా జరిగింది. లగ్జంబర్‍కు చెందిన ఉన్నతాధికారులు ఆమె చేత ప్రమాణం చేయించారు. లగ్జంబర్‍కు చెందిన అధికారులతో పాటు స్థానికంగా ఉన్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి హజరై సుహాసినిని అభినందించారు.

ఈ కార్యక్రమానికి సుహాసిని భర్త, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లగ్జంబర్గ్ అధికారులు మాట్లాడుతూ.. 350కిపైగా సినిమాల్లో నటించడమే కాక ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకొన్న సుహాసిని, ఈ గౌరవానికి అన్ని విధాలా అర్హురాలేనని అన్నారు. తనకు ఇంతటి అరుదైన గౌరవం దక్కడం పట్ల సుహాసిని ఆనందం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన బాధ్యతను అన్నివిధాల నెరవేరుస్తానని అన్నారు. తన నటనతో, పాత్రలతో దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లోనూ తానెంటో నిరూపించుకున్న సుహాసిని, ఇప్పటికీ గౌరవప్రదమైన పాత్రల్లో కనిపిస్తూ గొప్ప నటిగా పేరొందారు. వివిధ ఎన్జీఓ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా సుహాసిని మణిరత్నంకు 123తెలుగు తరపున అభినందనలు.

Exit mobile version