
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు.. జాతీయ అవార్డులు. భారతదేశంలో జాతీయ అవార్డు అందుకోవడమంటే ప్రతిష్టాత్మక ఆస్కార్ అందుకున్నట్టు. తాజాగా 2014 సంవత్సరానికి సంబంధించి జాతీయ అవార్డులను అవార్డు కమిటీ ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘చందమామ కథలు’ సినిమా ఎంపికైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత సంవత్సరం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమా జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడం విశేషం.
ఎనిమిది భిన్న నేపథ్యాల్లోని ఎనిమిది కథలను ఒక సినిమాగా తీయడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆ ఎనిమిది ప్రపంచాల కథలను ఒకే కథలా నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అద్భుతమైన భావోద్వేగాలను, సున్నితమైన కథనంతో తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రతిభను అడుగడుగునా ఈ సినిమాలో చూడొచ్చు. ఇక ఈరోజే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో క్వీన్ సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకోవడంతో పాటు నిజంగానే క్వీన్‌గా పిలిపించుకోబడ్డ నటి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సందర్భంగా, చందమామ కథలు సినిమా టీమ్ మొత్తానికి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు.