భారతదేశంలో విడుదలయ్యే సినిమాలను సెన్సార్ చేసే ప్రభుత్వ సంస్థ సెన్సార్ బోర్డ్ తాజాగా బాల నటులను సినిమాల్లో నటింపజేసే విషయమై కొన్ని నిబంధనలను విధించింది. ఈ తాజా నిబంధనలను ముందుగా తమిళ సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత ఇవే నిబంధనలను అన్ని భాషల సినిమాలకు వర్తింపజేస్తారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం రెండు రోజులకు మించి ఏ చైల్డ్ ఆర్టిస్ట్ అయినా షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తే జిల్లా విద్యా శాఖాధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. సినిమాలో గానీ, టీవీ ప్రోగ్రాంలో గానీ నటించేముందు చైల్డ్ ఆర్టిస్టులకు మెంటల్, ఫిజికల్ చెకప్ తప్పనిసరిగా చేయించాలనే నిబంధన విధించారు. అలాగే షూటింగ్ జరిగే సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్‌లతో పాటు తప్పనిసరిగా ఒక సైకాలజిస్ట్‌ను అందుబాటులో ఉంచాలి.
అదేవిధంగా షూటింగ్ జరిగే సమయంలో ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి ఒక గంట బ్రేక్ తప్పనిసరిగా ఇవ్వాలి. సినిమా ద్వారా ఆర్టిస్ట్‌కు అందే మొత్తంలో సగం వారి పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందిగా నిబంధనలు పేర్కొంటున్నాయి. సినిమా షూటింగ్ జరిగే క్రమంలో, ఆ తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది.
