మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఏప్రిల్ 30తో అధికారికంగా పూర్తయింది. గత నాలుగు రోజులుగా రామ్ చరణ్ మరియు శ్రుతి హాసన్‌లపై చిత్రీకరించిన స్పెషల్ ఐటమ్ సాంగ్‌తో పాటు, మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ పనులన్నీ ముగిశాయి. దీంతో చిత్ర యూనిట్ ఇక పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనుంది.
యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో, ఆ ఖాళీ అయిన జూన్ 4వ తేదీన ‘పెద్ది’ చిత్రాన్ని విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ తేదీ సరైనదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు రేపు చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం కానుంది. ఈ ప్రెస్ మీట్లోనే కొత్త రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
