పెద్ద సంస్థకు ‘బాహుబలి’ తమిళ హక్కులు!

Baahubali

దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘బాహుబలి’కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను హిందీలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘బాహుబలి’ తమిళ వర్షన్‌‌ను విడుదల చేయడానికి కూడా ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు రావడం విశేషం.

కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్‌లోనూ మంచి పట్టున్న నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్. సూర్య, కార్తీలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ‘బాహుబలి’ తమిళ రిలీజ్ హక్కులను సొంతం చేసుకుంది. బాహుబలికి అన్ని ప్రాంతాల్లో రిలీజ్‌కు స్ట్రాంగ్ సపోర్ట్ దొరకడంతో ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా మారుమోగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో మే 15నే బాహుబలి మొదటి భాగాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించినా విజువల్ ఎఫెక్ట్స్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో సినిమాను జూలై 10కి పోస్ట్‌పోన్ చేశారు. మే 31న బాహుబలి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో బాహుబలికి ప్రమోషన్ కల్పించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

Exit mobile version