ఎప్పుడూ సరికొత్త కథలతో, విభిన్న గెటప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త సినిమాతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ‘గ్యాంబ్లర్'(మంగాత్తా), ‘బిర్యాని’ సినిమాల ద్వారా దర్శకుడుగా తానేంటో నిరూపించుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం.
ఈ సినిమా ఆడియో వేడుక రేపు సాయంత్రం చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్‌కు సంబంధించిన అఫీషియల్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్‌కు కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది.
ఈ సినిమాలో సూర్య ఆత్మగా కనిపించి భయపెడతాడని సమాచారం. ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో భారీగా ప్రచారాన్ని కల్పించేందుకు సినిమా యూనిట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెలాఖర్లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.
