
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. తన అనితర సాధ్యమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు తిరుగులేని సూపర్ స్టార్‌గా కొనసాగిన చిరంజీవి, రాజకీయాల్లోకి ప్రవేశించాక సినిమాలకు దూరమైపోయారు. అయితే ఆయన అభిమానులు మాత్రం చిరు కచ్చితంగా సినిమా తీస్తాడనే నమ్మకంతో ఉన్నారు. చిరంజీవి కూడా గత కొన్నాళ్ళుగా ఇదే విషయమై సానుకూలంగా స్పందిస్తూండడంతో అభిమానుల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు.
తాజాగా ఆ ఉత్సాహాన్ని మరింత పెంచేలా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిరు తన 150వ సినిమాకు సిద్ధమైపోయారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. ఇదే విషయాన్ని రామ్ చరణ్ తన ఫేస్బుక్ ఎకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్ళుగా తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అన్న ఆశతో ఉన్న అభిమానుల్లో తాజా ప్రకటన ఆనందాన్ని నింపింది.