‘బాహుబలి’ ఆడియో లాంచ్‌కు భారీ క్రేజ్!

baahubali
దర్శకుడు రాజమౌళికి ప్రమోషనల్ కార్యక్రమాల్లో కొత్త పంథాను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా ఆడియో రిలీజ్ నుంచే ఈ తరహా ప్రమోషన్లతో సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేసే టెక్నిక్‌ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. గతంలో ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాల ఆడియో ఫంక్షన్లను కూడా వినూత్నంగా నిర్వహించి సరికొత్త ప్రమోషన్లలో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా ఆడియో రిలీజ్‌ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో రిలీజ్‌ను, థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోపే సినిమా పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ‘బాహుబలి’ సినిమాకున్న క్రేజ్, రాజమౌళి సరికొత్త స్ట్రాటజీలను క్యాష్ చేసుకోడానికి ఆడియో వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఎన్నో కార్పోరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయట. మీడియా సంస్థలు కూడా భారీ మొత్తానికి ఆడియో రిలీజ్‌ హక్కులను తీసుకోవాలని ప్రయత్నిస్తుండడం విశేషం.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి రాజమౌళి ఈ సినిమా ఆడియో రిలీజ్‌కు ఎలాంటి ప్రయత్నంతో వస్తారన్నది చూడాలి. ‘బాహుబలి’ మొదటి భాగాన్ని జూలై 10న విడుదల చేయనున్న విషయం తెలిసిందే!

Exit mobile version