సగటు తెలుగు సినీ అభిమాని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’.. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూస్తున్నారు.
ఇక అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల సందడి మొదలవ్వగా, రిలీజ్ రోజైన నేటి ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ షోస్ ఇప్పుడే మొదలయ్యాయి. భారీ హైప్ ఉండడం, ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా కావడంతో మొదటి వారాంతం ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్లన్నీ అప్పుడే అమ్ముడైపోవడం విశేషం. తెలుగు,తమిళ, మళయాల, హిందీ భాషల్లో సుమారు 4000 థియేటర్లలో బాహుబలి విడుదలైంది.
