ప్రభాస్-సుజీత్‌ల సినిమా సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు?

prabhas-sujith
దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ అనే సినిమా మొదలు పెట్టినప్పటినుంచీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సమయాన్నంతా బాహుబలి కోసమే వెచ్చించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సినిమాకు సంబంధించిన మొదటిభాగం ‘బాహుబలి ది బిగినింగ్’ నిన్ననే విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ‘బాహుబలి’ విడుదలవడంతోనే అభిమానులంతా రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్ కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టేశారు.

ఇక ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి ది కంక్లూజన్‌కు సంబంధించిన షూటింగ్‌ను అతి కొద్దిరోజుల్లోనే మళ్ళీ మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికల్లా బాహుబలి రెండో భాగం విడుదలకు ప్లాన్ చేశారు. కాగా ఇదే సమయంలోనే ప్రభాస్ తన కొత్త సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమా మొదట బాహుబలి రెండో పార్ట్ రిలీజ్ తర్వాతే సెట్స్‌పైకి వెళ్ళనుందనే ప్రచారం జరిగినా, తాజా సమాచారం మేరకు ప్రభాస్ బాహుబలి, సుజీత్ సినిమా రెండూ ఒకేసారి చేయనున్నారని తెలుస్తోంది. బాహుబలి కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని సమాచారం.

Exit mobile version