మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల కాకముందే ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలు ఉండడం విశేషం! ఇక ఈ అంచనాలను మరింత పెంచే ఓ ఆసక్తికర కథనం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయనున్నారన్న వార్త ప్రచారంలో ఉంది. అదికూడా తన నిజ జీవిత పాత్రలో కనిపించనుండడం మరింత విశేషం.
రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే! అందులో భాగంగానే మెగాస్టార్ సినిమాకు చరణ్ స్టంట్ మాస్టర్‌గా పనిచేసే తరహా సన్నివేశాలు రూపొందించారట. అంటే చెర్రీ హీరోగా తెరకెక్కే సినిమాలో తండ్రి చిరంజీవి సిసలైన హీరో పాత్రలో కనిపించి మెప్పించనున్నారన్నమాట. అయితే ఈ విషయమై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. గతంలో శ్రీనువైట్ల సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు మళ్ళీ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
