Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!

ముఖ్య అంశాలు

కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్‌కు ‘పూవే ఉనక్కాగ’ సినిమాతో లైఫ్ ఇచ్చింది నిర్మాత ఆర్.బీ. చౌదరినే.

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వచ్చిన ‘తుల్లాద మనముమ్ తుల్లుమ్’, ‘తిరుపాచి’ లాంటి బ్లాక్‌బస్టర్స్ విజయ్‌ను ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేశాయి.

అప్పట్లో విజయ్‌తో చౌదరి తీసిన హిట్స్ తెలుగులో శుభకాంక్షలు, నువ్వు వస్తావని, అన్నవరం లాంటి పేర్లతో రీమేక్ అయి ఇక్కడ కూడా సంచలనాలు సృష్టించాయి.

ఈ రోజు దళపతి విజయ్ కోలీవుడ్‌లో తిరుగులేని బాద్‌షా. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. వందల కోట్ల వసూళ్లు ఆయన స్టామినాకు నిదర్శనం. కానీ, స్టార్టింగ్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్న రోజుల్లో విజయ్ కెరీర్‌కు సరైన బ్రేక్ ఇచ్చి, అతడిని ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది మాత్రం ఆర్.బీ. చౌదరి గారే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించిన సినిమాలే విజయ్‌ను మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా చేశాయి.

తొలినాళ్లలో విజయ్ తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. కొన్ని సినిమాలు ఓకే అనిపించినా, ఏదీ ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు. సరిగ్గా ఆ టైమ్‌లో దర్శకుడు విక్రమన్‌ చెప్పిన కథను నమ్మి చౌదరి ‘పూవే ఉనక్కాగ’ (1996) సినిమాను ప్రారంభించారు. అప్పటివరకు కేవలం యూత్‌కు మాత్రమే పరిమితమైన విజయ్ ఇమేజ్‌ను ఈ సినిమా పూర్తిగా మార్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఈ కథలో ఉన్న దమ్ము ఎలాంటిదంటే.. దీన్ని వెంటనే తెలుగులో జగపతి బాబు హీరోగా ‘శుభకాంక్షలు’ (1997) పేరుతో, కన్నడలో ‘ఈ హృదయ నినాగాగి’ (1997) పేరుతో రీమేక్ చేశారు. ఇక హిందీలో అనిల్ కపూర్ హీరోగా ‘బధాయి హో బధాయి’ (2002) గానూ ఈ కథను తెరకెక్కించారు.

ఆ తర్వాత విజయ్ – సూపర్ గుడ్ ఫిల్మ్స్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మోత మోగించింది. దర్శకుడు ఎళిల్ తెరకెక్కించిన ‘తుల్లాద మనముమ్ తుల్లుమ్’ (1999) విజయ్‌లోని అద్భుతమైన నటుడిని బయటకు తీసుకొచ్చింది. కళ్లు లేని ప్రియురాలి కోసం తపించే ప్రేమికుడిగా విజయ్ నటన కంటతడి పెట్టిస్తుంది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కోలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా.. తెలుగులో నాగార్జున హీరోగా ‘నువ్వు వస్తావని’ (2000) పేరుతో రీమేక్ అయి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఫ్యామిలీ ఇమేజ్ నుంచి పక్కా మాస్ హీరోగా విజయ్ అవతారం ఎత్తడానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘తిరుపాచి’ (2005) ఒక రేంజ్‌లో హెల్ప్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది. ఇదే కథను పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో ‘అన్నవరం’ పేరుతో సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థే స్వయంగా నిర్మించింది. విజయ్ కెరీర్‌కు ఏ దశలో ఎలాంటి సినిమా కావాలో పక్కాగా అంచనా వేసి, దళపతి రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిన క్రెడిట్ ఆర్.బీ. చౌదరికే దక్కుతుంది. ఈ రోజు విజయ్ అనుభవిస్తున్న స్టార్‌డమ్ వెనుక సూపర్ గుడ్ ఫిల్మ్స్ వేసిన బలమైన పునాది ఉంది.

కానీ, ఇలా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప నిర్మాతను కోల్పోవడంతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, లెజెండరీ నిర్మాత ఆర్.బీ. చౌదరి మంగళవారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

Exit mobile version