కలాం గొప్పదనాన్ని కొనియాడిన సినీ పరిశ్రమ..

abdul-kalam
ఏపీజే అబ్దుల్ కలాం.. స్ఫూర్తిని నింపుతూ, ఆలోచనలను పంచుతూ, ఏ లక్ష్యమూ తెలియని కొన్ని లక్షల మందికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ప్రసంగాలిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. నిన్న సాయంత్రం కోట్లాది హృదయాలను కలవరపెడుతూ ఆయన తనువు చాలించిన విషయం తెలిసిందే. అబ్దుల్ కలాం అంటే ఓ గొప్ప వ్యక్తి, అద్భుతమైన సైంటిస్ట్, భారతావనికి రాకెట్‌ను పరిచయం చేసిన ఘనుడు, రాష్ట్రపతిగా కూడా పనిచేసిన వ్యక్తి. అయితే ఆయన్ను అందరూ ఎక్కువగా గౌరవించేది, గుర్తించేదీ ఒక స్ఫూర్తి ప్రధాతగానే! ఆ స్ఫూర్తిని నింపడమనే లక్షణమే ఆయనకు, ఆయన అలంకరించిన పదవులకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

ఇక చివరివరకూ తనదైన బాటలోనే ప్రయాణించిన ఆయన, నిన్న కూడా షిల్లాంగ్‌లో ఓ ప్రసంగం ఇస్తూ గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి పట్ల యావత్ దేశం దిగ్బ్రాంతికి లోనైంది. తెలుగు సినీ పరిశ్రమ సైతం కలాం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఘనతను కొనియాడింది. తెలుగు సినీ ప్రముఖులు అబ్దుల్ కలాం మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నటులు మోహన్ బాబు, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా సినీ ప్రముఖులంతా కలాం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చూపించిన ఆదర్శ బాటలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవ నివాళి అని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.

Exit mobile version