
సంచలనాల ‘బాహుబలి’ విడుదలై నాలుగు వారాలైనా ఇంకా అదే జోరు కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా విడుదలైన నాటినుంచే అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా నిన్నటితో నాలుగోవారంలోకి ప్రవేశించింది.
ఇక ఈ నాలుగు వారాల్లో తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఇక్కడ ‘బాహుబలి’కి తిరుగులేదు. అయితే హిందీ, తమిళంలో ‘బాహుబలి’కి పోటీగా పలు పెద్ద సినిమాలు విడుదలైనా బాహుబలి జోరుకు ఏ మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. ముఖ్యంగా తమిళనాట ఇతర స్టార్ హీరోల సినిమాలను సైతం పక్కనపెట్టి బాహుబలి సత్తా చాటింది.
చెన్నైలోని ప్రధాన మల్టిప్లెక్స్‌లతో పాటు తమిళనాడులోని ఇతర ప్రధాన థియేటర్లలోనూ బాహుబలికి తిరుగే లేకుండా పోయింది. నాలుగోవారంలో వేరే ఏ ఇతర సినిమాకూ లేనన్ని థియేటర్లలో నడుస్తూ తమిళనాడులో కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా బాహుబలి దూసుకెళుతోంది. ఇప్పటికే ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ రన్ ఎప్పటివరకు ఉంటుందనేది ఆసక్తికరం అంశం.