బంపర్ ధరకు ‘పులి’ తెలుగు వర్షన్‌ రైట్స్!

Puli
తమిళ సూపర్ స్టార్ విజయ్, శృతి హాసన్ జంటగా నటించిన భారీ చిత్రం ‘పులి’. తమిళంలో ఇళయదళపతి అంటూ విజయ్‌ని పిలుచుకునే అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తమిళనాట ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులను ఎస్వీఆర్ మీడియా అనే సంస్థ భారీ ధరకు సొంతం చేసుకోవడంతో, ఈ తమిళ క్రేజీ ప్రాజెక్టుకు తెలుగులోనూ క్రేజ్ మొదలుకానుంది.

‘జిల్లా’, ‘కత్తి’ లాంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత విజయ్ ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టనున్నాడనే టాక్ పులి విషయంలో మొదట్నుంచీ వినబడుతోంది. ఈమధ్యే జిల్లా తెలుగు వర్షన్‌తో హిట్ కొట్టిన విజయ్, పులితో తెలుగులో ఓ స్థానాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. జిల్లా హిట్ అయిన నేపథ్యంలో పులి తెలుగు వర్షన్ భారీ ధర పలికింది. ఎస్వీఆర్ సంస్థ సుమారు 8 కోట్ల రూపాయలకు తెలుగు వర్షన్ హక్కులను సొంతం చేసుకుంది.

చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హన్సిక మరో హీరోయిన్‌గా నటించగా శ్రీదేవి కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version