‘కత్తి’ తెలుగు రీమేక్‌కు రంగం సిద్ధం..!

Kaththi
విలక్షణ దర్శకుడు మురుగదాస్, తమిళ సూపర్ స్టార్ విజయ్ కాంబినేషన్‌లో రూపొంది ఘన విజయం సాధించిన తమిళ సినిమా ‘కత్తి’. ఈ సినిమాలో రైతుల కోసం పోరాడే పవర్‍ఫుల్ పాత్రలో విజయ్ అలరించారు. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు పెద్ద హీరోలు ఆసక్తి కనబరిచారు. అయితే అవన్నీ చర్చల దశల్లోనే ఆగిపోయి పట్టాలెక్కలేదు. దీంతో ‘జిల్లా’ రీమేక్‌లానే ‘కత్తి’ కూడా మూలన పడనుందని, చివరకు తెలుగులో డబ్ వర్షనే రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది.

కాగా తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్‌కు సంబంధించిన ఓ వార్త మళ్ళీ ఈ సినిమాపై ఆశలు రేకెత్తిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేసేందుకు సిద్ధమైపోయారని సమాచారం. ‘బలుపు’, ‘పండగ చేస్కో’ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గోపీచంద్, దర్శకుడు మురుగదాస్ వద్ద గతంలో అసిస్టెంట్‌గా చేశారు. ఇక తెలుగు వర్షన్ కోసం స్వయంగా మురుగదాసే స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయనున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! అది పూర్తి కాగానే కత్తి రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం.

Exit mobile version