‘శ్రీమంతుడు’ రన్‌టైమ్ ఎంతంటే..!

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టే వారం రానే వచ్చేసింది. ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు తమ హీరోను స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. మహేష్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఆగష్టు 7న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అంతటా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

ఇక నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘శ్రీమంతుడు’ సినిమా, సెన్సార్ బృందం తరపున ఎటువంటి కట్స్ లేకుండా ‘యూ/ఏ’ సర్టిఫికెట్ పొందింది. మొత్తం 2 గంటల 43 నిమిషాల నిడివి కలిగి ఉన్న ఈ సినిమా అభిమానులను అలరించేందుకు అన్ని అంశాలనూ నింపుకొని మనముందుకు రానుంది. ఇక ఈ మధ్య కాలంలో క్రిస్పీ రన్‌టైమ్ అనేది బాగా కనిపిస్తున్న నేపథ్యంలో శ్రీమంతుడు నిడివి కాస్త ఎక్కువనే చెప్పాలి. అయితే తాను చెప్పాలనుకున్న కథలో చాలా ఎమోషన్స్ ఉండడంతో సినిమాకు ఆ స్థాయి నిడివి కచ్చితంగా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. ఆద్యంతం సినిమా అందరినీ అలరిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, మహేష్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version