
సినీ అవార్డ్ ఫంక్షన్స్ అంటే తారల తళుకులు, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు.. ఇలా కళకళాలాడిపోయే వేదిక. ఇక గత మూడేళ్ళుగా జరుగుతూ వస్తోన్న సైమా అవార్డ్స్ది మరో ప్రత్యేకత. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరుతో సౌతిండియాలో నాలుగు భాషల సినిమాలకు ఈ వేడుకలో వివిధ క్యాటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తారు. దుబాయ్‌లో గత మూడేళ్ళుగా వైభవంగా జరుగుతూ వచ్చిన వేడుక ఈ సారి కూడా అదే సందడి తెచ్చిపెట్టింది. తారల సందడితో నిన్న మొదలైన ఈ వేడుక మొత్తం రెండు రోజుల పాటు జరగనుంది.
దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నిన్న అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక ఆట పాటలతో జోరుగా హుషారుగా సాగింది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరై ఈ వేడుకకు కొత్త శోభను తెచ్చిపెట్టారు. తెలుగు పరిశ్రమ నుంచి బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, రానా తదితరులు హ్యాజరయ్యారు. సినీ నటుల స్కిట్స్, ఆట, పాటలతో ఈ వేడుక జోరు మీద మొదలై అదే జోరును కొనసాగిస్తూ సాగుతోంది.