
ఒక సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమా, చెప్పుకోవడానికి బాగుంది కానీ బాక్స్ ఆఫీసు వద్ద వర్కౌట్ అవుతుందా, అభిమానుల అంచనాలను అందుకుంటుందా అనే ఓ చిన్న అనుమానం.. కానీ ‘శ్రీమంతుడు’ సినిమా ఇలాంటి అనుమానాలను, అపోహలను పటాపంచలు చేసి అభిమానుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. అంతే కాకుండా మహేష్ బాబు ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది.
శ్రీమంతుడు ఫస్ట్ వీకెండ్ లో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తంగా కలుపుకొని సుమారు 30 కోట్ల మార్క్ కి దగ్గరగా వస్తే, ఓవర్సీస్ లో 13.18కోట్లు సాధించింది. దీంతో మొదటి వారమే 40 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. వీకెండ్ మాత్రమే కాకకుండా వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండడంతో ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం మొదటి 6 రోజుల్లో ఈ సినిమా సునాయాసంగా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ టాప్ 3 మూవీస్ లిస్టులో ఈ సినిమా చేరిపోతుందని అంటున్నారు.
మహేష్ బాబు సరసన మొదటిసారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మైత్రి మూవీ మేకర్స్ వారు శ్రీమంతుడు సక్సెస్ తో చాలా హ్యాపీగా ఉన్నారు.