
‘శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్, అందాల తార శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా, అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ అంశాలతో జోడించి చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అదే విధంగా మహేష్-శృతి హాసన్‌ల జంట కూడా తెరపై అందంగా కనిపించింది. ముఖ్యంగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎపిసోడ్ ఈ బ్లాక్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ఇక ‘శ్రీమంతుడు’ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు, తన రోల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శృతి హాసన్ అభిమానులతో నిన్న ట్విట్టర్లో ఇంటరాక్ట్ అయిన విషయం తెలిసిందే! అభిమానులు తన ట్విట్టర్ హ్యాండిల్‌పై అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు శృతి హాసన్ అంతే ఆసక్తికరంగా ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ విషయమై మహేష్ తన ట్విట్టర్ ఎకౌంట్‌పై స్పందిస్తూ.. “శృతి హాసన్ చాట్ సెషన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూశా. శృతి హాసన్‌కు ఈ చాట్ మంచి ఫన్ ఇచ్చిందనుకుంటా” అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఇందుకు సమాధానంగా శృతి హాసన్, “అవును. చాట్ సెషన్ చాలా ఫన్ ఇచ్చింది” అంటూ రిప్లై ఇచ్చారు. ఎప్పుడూ పెద్దగా ట్వీట్స్ కూడా చేయని మహేష్, ఇలా సరదా ట్వీట్ కూడా చేయడం అభిమానులను ఒకేసారి ఆనందపరచడంతో పాటు ఆశ్చర్యపరిచింది కూడా. ఇదిలా ఉంటే.. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా ఐదు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ దాటి రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది.