
‘దాన వీర శూర కర్ణ’.. ఈ పేరు వింటే తెలుగు సినీ అభిమానులకు మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఆయన కెరీర్లోనే కాక, తెలుగు సినీ చరిత్రలోనూ ఓ మరచిపోలేని సినిమా. ఇప్పటివరకూ ఈ సినిమాను రీమేక్ చేసే ప్రయత్నాలు ఎప్పుడూ జరగకపోగా, మళ్ళీ ఎన్టీఆర్ వంశంలోనే నాలుగో తరం బాల నటుల ద్వారా ఈ ప్రయత్నం జరిగింది. కీ.శే.నందమూరి జానకిరామ్ తనయులు మాస్టర్ రామ్, మాస్టర్ సౌమిత్రలు ప్రధాన పాత్రలు పోషించగా ‘దాన వీర శూర కర్ణ’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
జె.వి.ఆర్. దర్శకత్వంలో జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వర రావులు నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు (ఆగష్టు 15న) విడుదల కానుంది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ మంచి విజయం సాధించాలని కాంక్షించారు. నందమూరి వంశం నుంచి నాలుగో తరంలో నటులుగా పరిచయమవుతున్న రామ్, సౌమిత్రలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాలుగో తరం కూడా సినిమాల్లోకి రావడం గర్వంగా ఉందని తెలిపారు. “చిన్న పిల్లలతో చేసిన ఈ ప్రయత్నం పెద్ద పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను” అంటూ ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇలాంటి ప్రయత్నమే అయిన ‘బాలల రామాయణం’తో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే!