
మహేష్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే! గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. మొదటివారం, విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించిన ‘శ్రీమంతుడు’, అదే జోరుతో నిన్న రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 65 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్‌తో పాటు చెన్నైలో కూడా అదే జోరు కొనసాగించింది. శ్రీమంతుడు తమిళ వర్షన్ ‘సెల్వందన్’కు చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర అర్బన్ ఏరియాల్లో మంచి రెస్పాన్సే వచ్చిన నేపథ్యంలో సెల్వందన్‌ను కేరళలో నిన్న విడుదల చేశారు. తమిళనాట తెలుగు వర్షన్‌తో పాటే ఆగష్టూ 7నే విడుదలైన సెల్వందన్, కేరళలో మాత్రం ఆగష్టు 14వరకూ ఆగాల్సి వచ్చింది.
ఇక గతంలో మహేష్ హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమా కేరళలో మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇక ‘సెల్వందన్’ సినిమా ఇప్పటికే అంతటా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కేరళలో కూడా ఈ సినిమాకు థియేటర్లు బాగానే దొరికాయ్. సెల్వందన్ కేరళలో కూడా మంచి విజయం సాధిస్తుందని టీమ్ నమ్మకంగా ఉంది. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‍గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది.