సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ సెకండాఫ్‌లో ఎక్కువగా సైకిల్‌పై తిరుగుతూ కనిపించడం అందరినీ బాగా ఆకర్షించింది. ఆ పోర్షన్ తెలుగు సినిమాకు ఫ్రెష్ ఫీల్‌ను తీసుకురాగా, చాలామంది అభిమానులు సైకిల్ బాట పట్టారు కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీమంతుడిని అనుకరిస్తూ సైకిల్‌పై తిరుగుతూ తీయించుకున్న ఫోటోలతో సందడి చేస్తున్నారు.
ఇక సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ హైద్రాబాద్ బైసిక్లింగ్ క్లబ్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘చక్‌దే ఇండియా రైడ్’ పేరుతో గ్గచ్చిబౌలిలో బైసిక్లింగ్ క్లబ్ ఓ రైడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, నటుడు జగపతి బాబు, దర్శకుడు కొరటాల శివలు అతిథులుగా విచ్చేశారు. శ్రీమంతుడులో సైకిల్‌పై తిరగడమనే కాన్సెప్ట్ గురించి పలు విషయాలు తెలియజేస్తూ మహేష్ ఈ రైడ్‌ను ప్రారంభించారు. ఇక ఈ రైడ్‌లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనాలు హాజరు కావడం విశేషంగా కనిపించింది.
