
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ సినిమా ఆయన బర్త్ డే కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గత 10 రోజులుగా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తను అనుకున్నట్టుగానే పెద్ద హిట్ అవ్వడంతో మహేష్ బాబు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించనున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని ప్రారంభించినప్పుడే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని తెలిపారు.
రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో జూలై నుంచే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కానీ మహేష్ బాబు శ్రీమంతుడు పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉండడం వలన ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసారు. తాజాగా మహేష్ బాబు సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది అనే సమాచారాన్ని తెలియజేశారు. ‘సెప్టెంబర్ 14 నుంచి బ్రహ్మోత్సవం ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడుతున్నాం. అక్కడి నుంచి ఆగకుండా ఏకధాటిగా షూటింగ్ చేయనున్నాం. ఈ సినిమా ఒక సంబరంలా ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల రెడీ చేసిన కథ, కథనం, పాత్రలను తీర్చిదిద్దిన విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానని’ మహేష్ తెలిపాడు.
పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు