సినిమా విజయంలో ప్రమోషన్స్‌దీ కీలక పాత్రే!

telugu-cinema-flag
ఎంత మంచి సినిమా అయినా, ముందు ఆ సినిమా ప్రేక్షకుడికి చేరాలంటే ప్రమోషన్స్‌దే కీలక పాత్ర అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్న విషయంపైనే కాక సినిమాపై కూడా ముందే ఒక అంచనాని, అభిప్రాయాన్నీ కల్పిస్తేనే ఆ సినిమా ప్రేక్షకుడిని చేరడంలో సఫలమవుతుంది. ఈ సూత్రాన్ని ఎప్పుడో ఒంటపట్టించుకున్న బాలీవుడ్, ఆ దిశగా అడుగులు వేసి బాలీవుడ్ మార్కెట్ స్థాయిని పెంచింది. ఇక తెలుగులో మాత్రం ఎప్పట్నుంచో చూస్తూ వస్తోన్న సాంప్రదాయ ప్రమోషన్స్ పద్ధతులే మొన్నటివరకూ కనిపించాయి.

కాగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా, ప్రమోషన్స్ విషయంలో కొత్త పుంతలు తొక్కి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే కాక, బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా ఊహక్కూడా అందనంత వసూళ్ళను రాబట్టింది. ఇక బాహుబలి సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో తెలుగులో ఆ తర్వాత నుంచి విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ సరికొత్త పంథాలో చేపట్టే ప్రమోషన్స్ విషయమై ఓ ఆలోచన చేస్తోంది.

‘బాహుబలి’ తర్వాత తెలుగులో భారీ అంచనాల మధ్య వచ్చిన సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ కూడా ప్రమోషన్స్ విషయంలోనూ అడ్వాన్స్‌డ్‌గా ఉంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగుతూ వస్తోన్న ప్రమోషన్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్, కాలేజీ యువతను ఆకట్టుకునే కాంటెస్ట్స్, మాల్స్‌లో యూత్‌ను పలకరించడం, పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో సినిమా టీమ్ పాలుపంచుకోవడం.. ఇలా సినిమా ప్రమోషన్‌కి ఉపయోగపడే ఏ అంశాన్నీ వదలకుండా చూసుకుంటున్నారు.

‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. ఇలా ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన సినిమాల కోవలోనే ప్రస్తుతం తెలుగులో రానున్న పెద్ద సినిమాలన్నీ ఈ బాట పట్టనున్నాయి. ఓ రకంగా ఈ పరిణామం తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచడమే కాకుండా, సినిమాలో ఏం చెప్పాలనుకున్నారనే విషయం కూడా బలంగా ప్రేక్షకులను చేరుతుంది. ఇక చివరగా, సినిమా విజయం సాధించడమనేది ఆ సినిమా ఎలా ఉందనే విషయంపైనే ఆధారపడుతుందనేది ఎంత నిజమో, ముందు ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించాలంటే మాత్రం ప్రమోషన్స్‌దే కీలక పాత్ర. సినిమా లాంగ్ రన్ అనేది రెండు వారాలకు మించి ఉండని ఈ కాలంలో ప్రమోషన్స్‌పై కూడా సరైన విజన్‌తో ముందుకెళ్ళే సినిమాలకే బాక్సాఫీస్ వద్ద ఉంటుందనేది తెలుగు సినిమా గుర్తించడం అభినందనీయం.

Exit mobile version