
సూపర్ స్టార్ మహేష్.. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ నిజమైన ‘శ్రీమంతుడు’ అని మరోసారి చాటి చెప్పుకున్నారు. ‘సాటి మనిషి కష్టం మనది కాకపోతే ఈ నేల మీద, సంఘంలో బతికి ఏం ప్రయోజనం’ అంటూ ‘శ్రీమంతుడు’తో అందరినీ మెప్పించిన మహేష్, తన అభిమాని కోరికను మన్నించి కాసేపు అతడితో సరదాగా గడిపారు. కాకినాడకు చెందిన ఓ బాలుడు గత కొంత కాలంగా క్రోనిక్ డిజార్డర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు. మహేష్‌కు పెద్ద ఫ్యాన్ అయిన ఈ బాలుడు, మహేష్‌ని ఒక్కసారైనా చూడాలని ఉందని కోరాడు.
మహేష్‌ను కలవాలనుకుంటున్న ఈ బాలుడి గురించి సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. చివరకు ఈ విషయం మహేష్‌ను చేరగా, ఆ బాలుడిని కలిసేందుకు మహేష్ స్వయంగా ఏర్పాట్లు చేయించారట. హైద్రాబాద్‌లో ఈ సాయంత్రం మహేష్ ఆ బాలుడితో కలిసి చాలాసేపు సరదాగా మాట్లాడారు. మహేష్‌ను చూసిన ఆనందంలో ఆ బాలుడు సంబరంలో మునిగిపోయాడు. ఇక ఒక అభిమాని కోసం మహేష్ స్వయంగా శ్రద్ధ కనబరచి అతణ్ణి కలవడం పట్ల మహేష్ అభిమానులు సైతం అభినందనలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ బాలుడు త్వరగా కోలుకొని, మళ్ళీ సరదాగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.