ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటేనే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. అదే క్రేజీ కాంబినేషన్ లో ఓ క్రేజీ హిట్ మూవీకి సీక్వెల్ వస్తోంది అంటే ఆ సినిమాపై అంచనాలు మరో రేంజ్ లో ఉంటాయి. అలాంటి అంచనాల నడుమ, మాస్ మహారాజ్ – రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘కిక్ 2’. వీరిద్దరి కాంబినేషన్ కి నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ తోడవడం సినిమాకి మరింత హైప్ ని పెంచేసింది. దాంతో ఈ సినిమాకి అన్ని ఏరియాల్లో సూపర్బ్ బిజినెస్ అయ్యింది. దాంతో నైజాం, సీడెడ్, ఆంధ్ర ఏరియాలలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఒక్క ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా కర్ణాటకలో కూడా ఈ సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కన్నడలో ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన బృంద అసోషియేట్స్ – రాము ఫిల్మ్స్ వారు కిక్ 2 సినిమాని బెంగుళూరు, మైసూర్ మరియు మిగిలిన కర్ణాటకలో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం కర్ణాటకలో ఓవరాల్ గా ఈ సినిమా సుమారు 100కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రవితేజ ఇటీవలే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన వజ్రకాయలో గెస్ట్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ క్రేజ్ తో కిక్ 2 ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
రవితేజకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. బ్రహ్మానందం, రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రా లాంటి కమెడియన్స్ ముఖ్య పాత్రలు పోషించారు.
