
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బాహుబలి ది కంక్లూజన్ కోసం సిద్ధమవుతున్నారు. అదలా ఉంచితే.. త్వరలో విడుదల కానున్న రెండు సినిమాలు, పోస్టర్ల ద్వారానే తనకు విపరీతమైన ఆసక్తి రేకెత్తించాయని రాజమౌళి తెలిపారు. ఆ సినిమాల్లో అనుష్క, ఆర్యా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సైజ్ జీరో’ ఒకటి కాగా, రెండోది త్రిష హీరోయిన్‌గా చేస్తోన్న ‘నాయకి’. ఈ రెండు పోస్టర్లు ఈ మధ్య కాలంలో తనకు ఎంతగానో ఆసక్తి కలిగించిన సినిమాలుగా ఆయన పేర్కొన్నారు.
సైజ్ జీరో కోసం అనుష్క, 30 కిలోల బరువు పెరిగి పెద్ద సాహసమే చేయడం పట్ల అనుష్కపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సైజ్ జీరోలో బొద్దుగా కనిపించనున్న లుక్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ఈ పోస్టర్ గురించి ప్రస్తావిస్తూ రాజమౌళి, అనుష్క ఈ లుక్‌లో చాలా కొత్తగా, అందంగా కూడా ఉన్నారని తెలిపారు. ఇక త్రిష నాయకి ఫస్ట్‌లుక్‌లో, త్రిష మొఖంలో నవ్వు, చేతిలో కత్తి, గెటప్ మూడింటి మేళవింపుతో పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోందని రాజమౌళి వ్యాఖ్యానించారు. నాయకి సినిమాకు గోవి దర్శకుడు. రాజమౌళి తన ట్విట్టర్ ఎకౌంట్‌ను వేదికగా చేసుకొని ఈ పోస్టర్స్‌పై ప్రశంసలు కురిపించారు.