
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగిన స్టార్. 2009 సార్వత్రిక ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేసిన చిరు, ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. అప్పటివరకూ 149 సినిమాలు చేసిన చిరు, 150వ సినిమా చేస్తారా లేదా అన్న ప్రశ్న గత కొద్దిరోజుల క్రితం వరకూ అభిమానులను తొలుస్తూనే ఉంది. ఇక ప్రశ్నలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ చిరంజీవి తన రీ-ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చిరు 150వ సినిమాకు అంతా రంగం సిద్ధమవడంతో, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ఇదలా ఉంచితే.. 150వ సినిమాకు రంగం సిద్ధం చేసిన దగ్గర్నుంచీ చిరుపై మళ్ళీ సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన 60వ జన్మదిన వేడుకలను కూడా భారీ ఎత్తున చేపడుతున్నారు. రేపు(ఆగష్టు 22న) చిరంజీవి పుట్టినరోజు కాగా, ఈ సాయంత్రం నుంచే వేడుకలు మొదలుకానున్నాయి. అభిమానుల సమక్షంలో ఈ సాయంత్రం శిల్పకళావేదికలో ఓ పెద్ద ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు చిరుతో పాటు ఇతర మెగా ఫ్యామిలీ హీరోలు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయ్. హైద్రాబాద్ మొత్తం మెగాస్టార్ చిరు ఫ్లెక్సీల సందడే కనిపిస్తోంది. అభిమానులు కూడా అప్పుడే అన్నిచోట్లా సంబరాలు మొదలుపెట్టేశారు.