
ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న మరో ప్రయోగాత్మక సినిమాయే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ‘తూంగవనం’ పేరుతో తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుందనే విషయాన్ని ఇంతకుముందే ప్రకటించగా, తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. రాజేష్ ఎమ్ సెల్వ ఈ రేసీ థ్రిల్లర్‌ను నవంబర్ 10న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక ఈమధ్యే పాపనశమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కమల్ హాసన్, ‘చీకటి రాజ్యం’ తనకు మరింత పెద్ద హిట్ తెచ్చిపెడుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 16న వినూత్నంగా విడుదల చేసిన తెలుగు, తమిళ ట్రైలర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ టేకింగ్, కమల్ యాక్టింగ్ ఈ సినిమా ట్రైలర్లో బాగా ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఓ సరికొత్త కథాంశంతో వస్తోన్న సినిమా కావడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే చీకటి రాజ్యం యూనిట్, సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడంతో పాటు భారీ రిలీజ్‌ను ప్లాన్ చేస్తోంది. త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు.