గుణశేఖర్ ఏళ్ళనాటి కలకు రూపం ‘రుద్రమదేవి’!

guna-shekar
గుణశేఖర్.. తెలుగు సినీ పరిశ్రమలో పలు క్లాసిక్స్ అనబడే సినిమాలకు దర్శకత్వం వహించి తానేంటో నిరూపించి చూపిన దర్శకుడు. అలాంటి దర్శకుడి ఏళ్ళనాటి కల అయిన రుద్రమదేవి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మళయాల భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. తాను ఏడో తరగతి చదివే సమయంలో రుద్రమదేవి కథను విని ముగ్దుడైపోయిన గుణశేఖర్, ఆ తర్వాత సినీ దర్శకుడిగా మారాక రుద్రమదేవి కథను సినిమాగా తెరకెక్కించాలని కలలు కన్నారు. వేరే ఏ సినిమా చేస్తున్నా కూడా రుద్రమదేవి కలను అలాగే కొనసాగిస్తూ వస్తూ ఇప్పటికి ఆ కలను తెరపై ఆవిష్కరించారు.

గుణశేఖర్ రుద్రమదేవి కల సాక్షాత్కారమైందంటే.. దాని వెనుక ఏళ్ళ కృషి, పరిశోధన, కష్టం, అభిమానం దాగున్నాయి. 12 ఏళ్ళ పాటు రుద్రమదేవి చరిత్రను క్షుణ్ణంగా సేకరించి, ఆ పరిశోధనను సినిమాగా మార్చడానికి మరికొంత కాలం శ్రమించి, మూడేళ్ళ పాటు సినిమా కోసం అవిశ్రాంతంగా శ్రమించి గుణశేఖర్ తన కలను ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా సినిమాను బలంగా నమ్మి, పట్టుదలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు గుణశేఖర్. ఇక ఇదంతా ఒక సాహసమైతే, ఈ సినిమాను 3డీలో నిర్మించాలని తలపెట్టి భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీగా రుద్రమదేవిని తెరకెక్కించడం గుణశేఖర్ చేసిన మరో అతిపెద్ద సాహసం.

అనుష్క, అల్లు అర్జున్, రానా, నిత్యా మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఇక తాను ప్రాణంగా భావించి గుణశేఖర్ చేసిన ఈ సాహసం బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టేసి మంచి విజయం సాధించాలని కాంక్షిద్దాం.

Exit mobile version