ప్రమోషన్స్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘కుమారి 21 ఎఫ్’!

kumari-21-f
‘కుమారి 21 ఎఫ్’.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘సుకుమార్ రైటింగ్స్’ అన్న బ్యానర్‌పై రూపొందించిన క్యూట్ లవ్‌స్టోరీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా ఈనెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇక గత కొద్దికాలం వరకూ ఎక్కడా పెద్దగా ప్రస్తావనకు కూడా రాని ఈ సినిమా టీజర్ లాంచ్ తర్వాత అంతటా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేయడంతో ఈ సినిమాపై మొదలైన క్రేజ్ ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది.

ఎన్టీఆర్ టీజర్ లాంచ్ చేయడం, ఆ తర్వాతి రోజు సూపర్ స్టార్ మహేష్ టీజర్ బాగుందంటూ కుమారి 21 ఎఫ్ టీమ్‌కు విషెస్ చెప్పడం వంటి విషయాలతో ఈ సినిమా అంతటా క్రేజీగా మారిపోయింది. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే దాదాపుగా పూర్తవ్వడంతో సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసేసింది. ఈ క్రమంలోనే పలు కాలేజీల్లో సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో కుమారి 21 ఎఫ్ టీమ్ మరింత ఉత్సాహంతో మున్ముందు ప్రమోషన్స్ చేపట్టనుంది.

రాజ్ తరుణ్, హిబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ అందించిన ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

Exit mobile version