ప్రత్యేక ఇంటర్వ్యూ : క్రిష్ – ఆ విషయంలో గర్వంగా ఉన్నా!

krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’.. దర్శకుడిగా క్రిష్ స్థాయిని, ఆలోచనా విధానాన్ని చాటిచెప్పే సినిమాలు. తీసింది తక్కువ సినిమాలే అయినా, ప్రతి సినిమాలోనూ తనదైన బలమైన భావోద్వేగాన్ని కథలో ప్రతిబింబించేలా చేసే దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు క్రిష్. ఇక ‘కంచె’ సినిమాతో ఏకంగా ఓ మెట్టు పైకెక్కి ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ చూడని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఒక ప్రేమకథకు జోడించి చెప్పారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా అంతటా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌తో ప్రత్యేకంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) క్రిష్ సినిమా అంటే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో, అందుకు తగ్గట్టుగానే మీదైన భావోద్వేగంతో నిండిన ‘కంచె’తో థియేటర్లకు వచ్చేశారు. రెస్పాన్స్ ఎలా ఉంది?

స) చాలా బాగుందండీ. చెప్పాలంటే నా కెరీర్లో ఇంతవరకూ ఎప్పుడూ ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎలాగైనా ఆదరిస్తారన్న నమ్మకాన్ని కంచె రెట్టింపు చేసింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై చూపిస్తున్న అభిమానం చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) సినిమా రిలీజ్‌కి ముందు ఒత్తిడి ఫీలయ్యారా?

స) కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. సినిమాను మనం ఎంతో ప్రేమించి తీస్తాం, అది ప్రేక్షకులకు ఎలా చేరువవుతుందా అనే విషయంలో ఎప్పుడూ కంగారైతే ఉంటుంది. కంచె విషయంలో ఒక మంచి సినిమా తీశాననే నమ్మకం మొదట్నుంచీ ఉంది. ప్రేక్షకుల మేధస్సును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కంచె సినిమాకు వస్తోన్న స్పందన ప్రేక్షకుల మేధస్సును తక్కువ అంచనా వేయొద్దనే సత్యాన్ని మరోసారి ఋజువు చేసింది.

ప్రశ్న) ఈ సినిమాకు ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?

స) కంచె సినిమాకు వచ్చినన్ని ప్రశంసలు నా ఏ ఇతర సినిమాలకూ రాలేదనే చెబుతా! రాఘవేంద్రరావు గారి లాంటి కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలను బాగా ఇష్టపడే దర్శకుడు ఫోన్ చేసి కంచె సినిమాపై ప్రశంసలు కురిపించారు. పలువురు ఇతర సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తూండడం మరింత ఉత్సాహాన్నిస్తోంది.

ప్రశ్న) ఇప్పుడీ విజయాన్ని ఎలా ఆస్వాధిస్తున్నారు?

స) చాలా గొప్పగా ఉందండీ. ఫిల్మ్‌మేకర్ అనే వాడు కలలు కంటూ ఉంటాడు. ఎప్పుడూ ఆ కలల్ని నిజం చేసుకునే పనిలోనే ఉంటాడు. ఆ కలలు నిజమై, వాటికి ప్రేక్షకులు కూడా అండగా నిలబడితే ఇలాంటివి మరిన్ని కలలు కంటాడు. ఇంకా గొప్పగా ఆలోచిస్తాడు. కంచె విజయం నన్ను మరింత పెద్ద కలలు కనేలా చేసింది. ఇక నిన్ననే టీమ్ మెంబర్స్ అంతా కలిసి ప్రైవేట్ పార్టీలో కలిశాం. ఓ దగ్గర నిలబడి పక్కకు తిరిగి చూస్తే వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌ల మొఖంలో ఆనందం కనిపించింది. అన్నింటికంటే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చిందంటే.. సినిమా ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా అలాగే నవ్వుతూ కనిపించారు. ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండడమంటే ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి!

ప్రశ్న) సాధారణ ప్రేక్షకుల దగ్గర్నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది?

స) అందరికీ సినిమా బాగా నచ్చిందండీ. నేను ఇందాకే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడా. అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రేక్షకులు కూడా మంచి సినిమా వస్తే ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్నిసార్లు మనమే సాహసం చేయడంలేదేమో అనిపిస్తూంటుంది. కావాలంటే ఇప్పుడు నేను ఒక ఫార్మాట్‌ను నమ్ముకొని ఒక ఫుల్ కమర్షియల్ సినిమా తీయగలను. కానీ ఇక్కడ ఒక ఫిల్మ్‌మేకర్‌గా ఏదైనా చెప్పాలని బలంగా ఉన్నపుడు కావాలని అలాంటి దారిలో వెళ్ళలేం!

ప్రశ్న) ఈ విజయంలో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌లకు ఎంత భాగస్వామ్యం ఉంది?

స) ఈ సినిమాకు వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌లను తప్ప మరొకరిని ఊహించలేమని నేను ముందే చెప్పా. ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా అదే మాట చెబుతున్నా. వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఇద్దరూ ఒదిగిపోయి నటించారు. వరుణ్ తేజ్ నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడు.

ప్రశ్న)సినిమా కొంచెం స్లో నెరేషన్‌లో సాగింది’ అనే టాక్ వినిపిస్తోంది కదా. ఈ విషయంపై మీరేమంటారు?

స) ఈ స్లో నెరేషన్ అనే కాన్సెప్టే నాకెందుకో అర్థం కాలేదు. ఇలాంటి జానర్లో నడిచే సినిమా దాదాపుగా ఈ స్టైల్ నెరేషన్‌లోనే చెప్పాలి. నేను కథ రీత్యా ఈ పేస్‌ను నమ్మాను కాబట్టే అదే దారిలో వెళ్ళా. అదేవిధంగా ఈ సినిమా ఈ కాలంలో నడుస్తున్న సినిమా కాదు. అలాంటప్పుడు అప్పటి నేపథ్యానికి తగ్గట్టుగానే సినిమా వేగం ఉండాలి. కావాలని వేగం పెంచితే చెప్పాలనుకున్న ఎమోషన్ మిస్సయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. ఈ స్లో నెరేషన్ అనేదానిపై వస్తోన్న కామెంట్స్‌కి నేనైతే మొదట్నుంచీ అనుకున్నట్టుగానే తీశాననే సమాధానం ఇస్తా.

ప్రశ్న) ఇండియన్ సినిమాలో రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘కంచె’. ఆ అనుభూతి ఎలా ఉంది?

స) గర్వంగా ఉందండీ. ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకూ ఒక్క సినిమా రాలేదంటే ఆశ్చర్యమే! అయితే, ఆ అవకాశం నాకు దక్కినందుకు, దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ స్క్రీన్‌పై వచ్చిన మొట్టమొదటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్య కథగా ‘కంచె’ నిలిచింది. ఈ క్రెడిట్‌ ఇప్పుడు నాకే సొంతమైంది. ఆ విషయంలో గర్వంగా ఉన్నా!

ప్రశ్న) బిజినెస్ పరంగా సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది?

స) నా కెరీర్లో మొదటిసారి అద్భుతమైన రివ్యూలతో పాటు అందుకు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కంచె మాకు మంచి లాభాలను తెచ్చిపెట్టే సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రోజురోజుకీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. సో, ఈ వారాంతం కల్లా మంచి నెంబర్స్ వస్తాయి. ఇది కచ్చితంగా నాకు, నా కెరీర్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చే విషయమే!

ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులేంటి?

స) బాలీవుడ్‌లో పలు పెద్ద స్టూడియోలతో ఒప్పందం కుదిరింది. వాటికి సంబంధించిన విషయాలన్నీ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. అవన్నీ సెట్ కాగానే నా తరువాతి సినిమా ఏంటనేది ప్రకటిస్తా. ప్రస్తుతానికైతే కంచె సినిమా విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాధిస్తున్నా.

కంచె సినిమా మంచి విజయం దిశగా దూసుకెళుతోన్న సందర్భంగా క్రిష్‌కి మరోసారి అభినందనలు తెలియజేస్తూ మా ఇంటర్వ్యూ ముగించాం.

Exit mobile version