‘కంచె’.. దర్శకుడిగా నా కెరీర్ బెస్ట్ : క్రిష్

krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’.. దర్శకుడిగా క్రిష్ స్థాయిని, ఆలోచనా విధానాన్ని చాటిచెప్పే సినిమాలు. తీసింది తక్కువ సినిమాలే అయినా, ప్రతి సినిమాలోనూ తనదైన బలమైన భావోద్వేగాన్ని కథలో ప్రతిబింబించేలా చేసే దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు క్రిష్. ఇక ‘కంచె’ సినిమాతో ఏకంగా ఓ మెట్టు పైకెక్కి ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ చూడని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఒక ప్రేమకథకు జోడించి చెప్పారు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

క్రిష్ మార్క్ టేకింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్, ఓ ఎమోషనల్ కథకు అన్నిచోట్లా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మొదటి వారాంతం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక తన సినిమాకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వసూళ్ళు రెండూ రావడం పట్ల క్రిష్ చాలా సంతోషంగా ఉన్నారు. తన కెరీర్లో మొదటిసారి ఓ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఇక ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నింటిలోకెల్లా కంచె దర్శకుడిగా తన బెస్ట్ అని క్రిష్ చెప్పుకొచ్చారు.

కంచె కోసం చాలా రీసెర్చ్ చేసి ప్రతీ క్యారెక్టర్‌కూ ఒక సరైన ఎమోషన్ ఇవ్వడంలో సఫలమయ్యామని తెలిపారు. స్వతహాగా కంచె సినిమా దర్శకుడిగా తన బెస్ట్ వర్క్ అనుకుంటున్నట్లు క్రిష్ స్పష్టం చేశారు. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version