
ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి లాంటి పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమాలతో సక్సెస్ తో పాటు మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది మన యోగ బ్యూటీ అనుష్క. ఈ ఏడాది అనుష్క నుంచి రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సైజ్ జీరో’. రుద్రమదేవి సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ అనుష్క లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది లేదు, తనే రుద్రమదేవికి హీరో, ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ఈక్వల్ గా కష్టపడుతుంది అని కితాబులిచ్చాడు. తాజాగా ఇదే తరహా మన్ననలను మరోసారి అందుకుంది మన అనుష్క. ఎప్పుడు ఎలా అనే విషయానికి వెళ్తే.. పివిపి బ్యానర్ లో తెరకెక్కిన అనుష్క సైజ్ జీరో ఆడియో నిన్న సాయంత్రం హైదరబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకి ఎస్ఎస్ రాజమౌళితో పాటు రానా, రాఘవేంద్ర రావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బి. గోపాల్, దశరథ్, గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో కీరవాణి ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడుతూ ‘ప్రకాష్ ని చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. రాఘవేంద్ర రావు లోని క్రమశిక్షణ, చమత్కారం, అంకితభావం ప్రకాష్ లోనూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సింది.. అనుష్క, తను ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. అనుష్క లేకపోతే ఈ సైజ్ జీరో అనే సినిమా ఉండేది కాదని’ అన్నాడు. మిగతా అతిధులు కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా కోసం అనుష్క తన పిజికల్ లుక్ ని పూర్తిగా మార్చుకొని 20 కేజీలు బరువు పెరిగింది.
అనుష్కతో పాటు ఈ సినిమాలో ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 27న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.