ఇంటర్వ్యూ : అఖిల్ – ఆ మూడు ఎపిసోడ్స్ లేకపోతే అఖిల్ లో హైపిచ్ ఉండదు.!

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం కానున్న మూడవతరం హీరో అక్కినేని అఖిల్. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా ‘అఖిల్’ నవంబర్ 11న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ తో కాసేపు ముచ్చటించి అఖిల్ సినిమా విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం.

ప్రశ్న) అఖిల్ జర్నీలో బాగా టెన్షన్ పడ్డ సమయం ఏది.? అలాగే రిలీజ్ విషయంలో ఎంత టెన్షన్ గా ఉన్నారు.?
స) అఖిల్ సినిమా విషయంలో నేను బాగా టెన్షన్ పడ్డ సమయం అంటే అది రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సమయంలోనే.. సినిమా ఆన్ టైం ఇవ్వలేకపోయాం అని టెన్షన్ పడ్డాను. ఇక ఫస్ట్ మూవీ అన్నప్పుడు ఎవరన్నా టెన్షన్ గా ఉంటారు. అలానే నేను కూడా ఉన్నాను. కచ్చితంగా 10వ తేదీ రాత్రి అయితే నిద్రపోను.

ప్రశ్న) పోస్ట్ పోన్ అయినప్పుడు మీరు నాగ్ పై అలిగారని పలు వార్తలు వచ్చాయి దానిపై మీ కామెంట్.?
స) అవన్నీ రూమర్స్ మాత్రమే.. ఆ న్యూస్ చదివినప్పుడు నేను జోక్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా సినిమా ది బెస్ట్ క్వాలిటీతో ఇంత హ్యాపీగా సినిమా రిలీజ్ అవుతోంది అంటే దానికి నాన్నగారే కారణం. చెప్పాలంటే సినిమా రిలీజ్ వాయిదా అన్నప్పుడు నేను బాగా భయపడి టెన్షన్ ఫీలైపోయాను. అప్పుడు ఆయనే నాకు గైడెన్స్ ఇచ్చి ఆ టెన్షన్ నుంచి బయటకి తీసుకువచ్చారు.

ప్రశ్న) వినాయక్ హీరోని కమర్షియల్ గా చాలా ఎలివేట్ చేస్తారు. మరి అఖిల్ డెబ్యూ మీ మూవీలో మీ పాత్రని ఎలా డిజైన్ చేసారు?
స) వినాయక్ గారి సినిమాల్లోలానే ఇందులో కూడా నేను టిపికల్ కమర్షియల్ హీరోలా కనిపిస్తూనే కొత్తగా కూడా ఉంటుంది. కానీ సడన్ గా ఒక పాయింట్ మీద ప్రజల కోసం పోరాడే హీరోలా ఉండదు. సందర్భానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే పాత్ర. ముఖ్యంగా చెప్పాలంటే కథకి తగ్గట్టు ట్రావెల్ అవుతుంది. నేను సినిమా ఓకే చెయ్యడానికి కారణమే కథ.

ప్రశ్న) సిజి వర్క్ కోసం డిలే అన్నారు. మరి అంతలా కథకి ప్రాముఖ్యత ఉన్న సీన్స్ ఇందులో ఏమున్నాయి.?
స) ఈ సినిమా కథకి గ్రాఫిక్స్ అవసరం.. ఇందులో వినాయక్ గారు మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసారు. వాటికి గ్రాఫిక్స్ అవసరం. ఈ సినిమాలో అండర్ వాటర్ ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ లో మూవింగ్ ప్లేన్ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ మరియు పాంథర్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది.. ఈ మూడు ఎపిసోడ్స్ లేకుండా సినిమా కథ రన్ అవ్వదు, అలాగే అవి లేకుండా సినిమా పీక్స్ స్టేజస్ కి వెళ్ళదు. ఇవన్నీ రియల్ గా షూట్ చేయలేం అందుకే సిజిలో కేర్ తీసుకొని షూట్ చేసాం.

ప్రశ్న) ఎన్నో కథలు విన్న మీరు ఈ కథనే ఎందుకోవడానికి అలాగే వినాయక్ ని డైరెక్టర్ గా సెలక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి.?
స) నా ఫస్ట్ సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అవ్వాలని అనుకున్నాను. మనం తర్వాత మొదటి సినిమా కోసం సరైన కథ దొరక్క క్లారిటీ లేక తిరుగుతుంటే నితిన్ వచ్చి ఈ కథ విను అని వినాయక్ చేత కథ చెప్పించారు. కథ నాకు బాగా నచ్చింది దానికంటే మించి వినాయక్ నాకు ఇచ్చిన కాన్ఫిడెంట్ ఈ సినిమా చేసేలా చేసింది. అలా సెట్ అయ్యిందే అఖిల్ అంతే కానీ క్రేజీ డైరెక్టర్ ని అనుకొని తారావత కథ వెతుక్కొని చేసింది కాదు. అఖిల్ సినిమా కథే నన్ను ఈ సినిమా చేసేలా చేసింది.

ప్రశ్న) అక్కినేని ఫ్యామిలీకి ఉన్న రొమాంటిక్ హీరోస్ అనే ఇమేజ్ ని చెరిపేయడం కోసమేనా యాక్షన్ ఫిలిం చేసారు.?
స) రొమాంటిక్, యాక్షన్ అని కాదండి.. పర్టిక్యులర్ గా మొదటి సినిమాకే ఒక తరహా హీరోనే అని ఫిక్స్ అయిపోకూడదు అని అనుకున్నాను. అన్ని రకాల సినిమాలు చేయాలన్నదే నా టార్గెట్. అందుకే ఇలాంటి కథని సెలక్ట్ చేసుకున్నాను. కచ్చితంగా అన్ని తరహా కథలు చేస్తాను, అందులో రొమాంటిక్ సినిమాలు కూడా చేస్తాను.

ప్రశ్న) ఒక యాక్టర్ గా ఈ సినిమాలో మీకు బాగా కష్టం అనిపించిన డిపాట్మెంట్ ఏంటి.?
స) యాక్టింగ్ మీద కోర్స్ చేసాను, అలాగే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి యాక్టింగ్ మీద ఐడియా ఉంది. అలాగే యాక్షన్, డాన్సుల మీద కూడా బాగా వర్కౌట్ చేసాను. కాబట్టి ఆ విషయంలో నేను పెద్దగా కష్టం ఫీలవ్వలేదు. కానీ షూటింగ్ టైంలో అర్థమైంది ఏంటంటే కామెడీ చేయడం అనేది చాలా కష్టం. అదీ బ్రహ్మానందం గారిని పక్కన పెట్టుకొని కామెడీ చేయడం అంటే చాలా కష్టం. కామెడీ చేయడంలో చాలా కష్టపడ్డాను. కానీ నెక్స్ట్ మూవీలో ఇంకా బెటర్ గా చేస్తాను.

ప్రశ్న) యంగ్ హీరోస్ మల్టీ స్టారర్ కి ఇప్పుడిప్పుడే కాస్త ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మల్టీ స్టారర్ కి మీరు కూడా సై అంటారా.?
స) నేను మల్టీ స్టారర్ సినిమాలకి సిద్దంగా ఉన్నాను. అలాంటి సినిమాలు చేస్తేనే తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతుంది. మంచి కథ దొరికి ఇంకో హీరో కూడా చేయడానికి సిద్దమైతే నేను కూడా రెడీనే..

ప్రశ్న) మీ డాన్సులతో అందరినీ సర్ప్రైజ్ చేసారు. మీకు డాన్సులలో స్పూర్తిగా నిలిచే స్టార్స్ ఎవరు?
స) చెప్పాలంటే నేను ఎప్పుడూ ఎక్కడా నా డాన్స్ స్కిల్స్ చూపలేదు. అందుకే నాన్నతో సహా అందరూ షాక్ అయ్యారు. హీరోగా నాకు స్పూర్తినిచ్చిన డాన్సర్ చిరంజీవి గారు అయితే, డాన్సర్ గా మాత్రం ప్రభుదేవా గారే స్ఫూర్తి. ఈ సినిమా విషయంలో జానీ మాస్టర్ నా డాన్సుల విషయంలో బాగా కేర్ తీసుకున్నాడు.

ప్రశ్న) మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం.. మరి మీరు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా.?
స) స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. దానికోసం చాలా రీసర్చ్ చెయ్యాలి, స్టార్స్ తో పాటు ఆ స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ కి చెందిన వారు నటించాలి. కథని పర్ఫెక్ట్ గా సిద్దం చేసి తీయగలరు అనే నమ్మకం కలిగితేనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాను. నాకు తెలిసి ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన ఒకే ఒక్క పర్ఫెక్ట్ స్పోర్ట్స్ సినిమా అంటే రాజమౌళి తీసిన సై అనే చెప్తాను.

ప్రశ్న) అఖిల్ తర్వాత మీ కెరీర్ ప్లాన్స్ ఏంటి?
స) నేను ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చా.. ఇకపై ఎస్టాబ్లిష్ అవ్వాలి. అందుకే తొందరపడి హడావిడిగా సినిమాలు చేయకుండా ఒక్కో సినిమా చేసుకుంటూ రావాలని డిసైడ్ అయ్యాను. ఒక మూడేళ్ళ తర్వాత పూర్తి ఎస్టాబ్లిష్ మెంట్ వచ్చాక అప్పుడు ఫాస్ట్ గా సినిమాలు చేస్తాను. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ నా మొదటి చాయిస్ తెలుగు, ఇక్కడ సక్సెస్ అయ్యాకే అక్కడ సినిమాలు చేస్తాను.

Exit mobile version