‘చీకటి రాజ్యం’ తమిళ వర్షన్‌కు పాజిటివ్ టాక్!

cheekati-rajyam
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ‘తూంగవనం’ అనే సినిమా దీపావళి కానుకగా నేడు తమిళ నాట పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా తెలుగు వర్షన్ చీకటి రాజ్యం పేరుతో తెరకెక్కింది. ఇక ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని కమల్ భావించినా, అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైన అఖిల్ సినిమా కోసం కమల్, తెలుగు వర్షన్‌ ‘చీకటి రాజ్యం’ను పదిరోజుల పాటు వాయిదా వేశారు. ఇక తమిళ వర్షన్ ఇవ్వాళే విడుదలైపోయినా, తెలుగు వర్షన్ మాత్రం నవంబర్ 20న రానుంది.

ఇక తమిళ నాట నిన్న రాత్రి నుంచే మొదలైన తూంగవనం సినిమా సందడి నేడు మరింత ఊపందుకుంది. కమల్ అభిమానులు సినిమాకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక విడుదలైన మొదటి షో నుంచే ఈ సినిమాకు అంతటా మంచి టాక్ వినబడుతోంది. ముఖ్యంగా కమల్ ప్రయోగాలను ఇష్టపడేవారిని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తూంగవనంకు మంచి రివ్యూలు వచ్చాయి. అదే విధంగా ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. ఒకేఒక్క రాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో నడిచే ఈ సినిమా టెక్నికల్ అంశాల పరంగా ఇండియన్ సినిమాల్లో ఓ ప్రత్యేకత చాటుకుంటుందని కమల్ మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజేష్ ఎమ్. సెల్వ దర్శకత్వం వహించారు.

Exit mobile version