
అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఈ ఏడాది మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాని నవంబర్ చివర్లో 30వ తేదీన లాంచ్ చేయనున్నారని, అలాగే డిసెంబర్ మొదటి వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.
అందులో మొదటి ఇద్దరిగా అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ లను ఎంపిక చేసారు. అంతే కాకుండా శృతి హాసన్ ఏ పాత్రలో కనిపించనుందో కూడా తెలిసింది. మలయాళంలో సాయి పల్లవి నటించిన లెక్చరర్ పాత్రలో శృతి హాసన్ కనిపించనుంది. ఆ ఎపిసోడ్ లో శృతి హాసన్ కి స్టూడెంట్ గా నాగ చైతన్య కనిపిస్తాడు. వీరి మధ్య ఒక లవ్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రస్తుతం మూడవ హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున, వెంకటేష్, నితిన్ లు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.